గ్లాస్గో: ఏస్ షట్లర్ పారుపల్లి పారుపల్లి కశ్యప్ చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో 32 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ పసిడిని సాధించి బ్యాడ్మింటన్ దిగ్గజాలైన ప్రకాశ్ పడుకోనే, సయ్యద్ మోదీల సరసన నిలిచాడు. 1978 కెనడాలో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో ప్రకాశ్ స్వర్ణం సాధించగా, నాలుగేళ్ల తర్వాత జరిగిన పోటీల్లో సయ్యద్ పసిడిని నెగ్గాడు.
ఆదివారం జరిగిన ఫైనల్లో మూడు దశాబ్దాల తర్వాత కశ్యప్ స్వర్ణపతకం సాధించి భారత పతాకను ఎగురవేశాడు. గంటపైగా జరిగిన హోరాహోరీ పోరులో కశ్యప్ 21-14, 11-21, 21-19తో సింగపూర్ షట్లర్ డెరిక్ వోంగ్‌ను ఓడించాడు. ఢిల్లీలో కాంస్యం నెగ్గిన కశ్యప్ గ్లాస్గోలో స్వర్ణం సాధించి సత్తా చాటాడు.
రెండో సీడ్‌గా బరిలోకి కశ్యప్ తన కెరీర్‌లోనే అతిపెద్ద పతకాన్ని దక్కించుకున్నాడు. మొదటి గేమ్‌లో కశ్యప్‌కు ప్రత్యర్థి నుంచి అంతగా పోటీ ఎదురుకాలేదు. సులువుగా పాయింట్లు సంపాదిస్తూ.. 14-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ వోంగ్ పుంజుకుని వరుస స్మాష్‌లతో నాలుగు పాయింట్లు సాధించాడు. అయితే నెట్‌గేమ్‌లో మెరుగ్గా ఉన్న కశ్యప్ 18-12తో ఆఽధిక్యంలోకి దూసుకెళ్లాడు.

అదే జోరులో 21-14తో తొలిగేమ్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో వోంగ్.. గేమ్ ప్లాన్‌ను మార్చాడు. కశ్యప్ పొరబాట్ల నుంచి లబ్ది పొందిన వోంగ్ 21-11తో గెలుచుకుని 1-1తో సమం చేశాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ కచ్చితమైన స్మాష్‌లతో విరుచుకుపడ్డాడు.
కానీ వోంగ్ డిఫెన్స్ ముందు అవి అంతగా పనిచేయలేదు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఓ దశలో కశ్యప్ 19-16తో పైచేయి సాధించాడు. తర్వాత వోంగ్ మరో మూడు పాయింట్లతో రేసులోకొచ్చాడు. చివర్లో మ్యాచ్ పాయింట్‌లో వోంగ్ కోర్టు బయటకు కొట్టడంతో.. కశ్యప్ ఆనందంతో కేరితంలు కొట్టాడు. అంతకుముందు రోజు మరో తెలుగుతేజం గురుసాయి కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.
జ్వాలా - అశ్వినీ జోడీకి రజతం
మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్వినిల జోడీ రజతంతో సంతృప్తి పడింది. మహిళ డబుల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జ్వాల-అశ్వినిల జోడీ అనవసర తప్పిదాలతో స్వర్ణాన్ని చేజార్చుకుంది. పసిడిపై భారీ ఆశలతో బరిలోకి దిగిన జ్వాల-అశ్విని జోడీ 17-21, 21-23లో వివియాన్ కా మున్ హో, కే ఉయ్ ఉన్ (మలేసియా) జోడీ చేతిలో వరుస గేముల్లో ఓడి రజతంతో సంతృప్తి పడింది.
మొదటి గేమ్‌లో వచ్చిన లీడ్‌ను కాపాడుకోవడంలో జ్వాల జోడీ విఫలమెంది. రెండో గేమ్‌లోనూ నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక ఓటమివైపు అడుగులు వేసింది. మూడో స్థానం మ్యాచ్‌లో గాబ్రియెల్-లౌరెన్ స్మిత్ (ఇంగ్లండ్) జోడీ కాంస్యం గెలుచుకుంది.
కామన్వెల్త్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. శనివారం రాత్రి జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పీందర్ సింగ్ కాంస్యాన్ని గెలుచుకున్నాడు. వర్షం కారణంగా మైదానంలోని ట్రాక్‌లు తడిసి ఉన్నా అర్పీందర్ 16.63 మీటర్లు దూకి కాంస్యాన్ని పట్టాడు. మొదటి ప్రయత్నంలోనే అద్భుతంగా దూకిన అర్పీందర్.. తర్వాత చేసిన ఐ దు ప్రయత్నాల్లోనూ దాన్ని అధిగమించలేకపోయాడు.