కొరియా గడ్డపై త్రివర్ణ పతాకం ఎగరేసిన తెలుగు కుర్రాళ్ళు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ మరో ముందడుగు వేసింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకుకు చేరుకుంది. ఇది వారి కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ జోడీ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ముగిసిన కొరియా ఓపెన్ ఫైనల్ లో అద్భుతమైన విజయం సాధించిన ఈ జోడీ.. ర్యాంకింగ్స్ లో ఒక స్థానం మెరుగైంది. ఈ క్రమంలోనే రెండో స్థానంలో ఉన్న చైనా జోడీ లాంగ్ వెయ్ కెంగ్, వాంగ్ చాంగ్ ను రీప్లేస్ చేసింది. ఈ చైనీస్ జోడీపై కొరియా ఓపెన్ సెమీస్ లో సాత్విక్, చిరాగ్ జోడీ ఓడించింది. ఇప్పుడు వారి ర్యాంకును కూడా కైవసం చేసుకుంది.

సాత్విక్, చిరాగ్ జోడీ ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో ఫైనల్ చేరింది. వీటిలో కొరియా ఓపెన్ ఒకటి. అంతేకాదు ఈ సీజన్లో వీళ్ళు ఆడిన ప్రతి ఫైనల్ గెలిచారు కూడా. ప్రస్తుతం ఆసియా ఛాంపియన్లుగా ఉన్న ఈ జోడీ.. ఇప్పటి వరకు కొరియా ఓపెన్ (సూపర్ 500), స్విస్ ఓపెన్ (సూపర్ 300), ఇండోనేషియా ఓపెన్ (సూపర్ 1000) టైటిల్స్ సాధించింది.
ప్రస్తుతం సాత్విక్, చిరాగ్ జోడీ వద్ద 87,211 పాయింట్లు ఉన్నాయి. కొరియా ఓపెన్ వీరికి ఈ ఏడాది నాలుగో ఫైనల్. ఈ మ్యాచులో ప్రపంచ నంబర్ వన్ జోడీ ఫజర్ ఆల్ఫియన్, మహమ్మద్ రియాన్ ఆర్డియాంటో చేతిలో తొలి గేమ్ ఓడింది. కానీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ట్రోఫీని కైవసం చేసుకుంది.
సాత్విక్, చిరాగ్ జోడీ ఈ సీజన్లో ఫైనల్ చేరిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడింది. అంతేకాదు, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో వరుసగా పది మ్యాచులు గెలిచి రికార్డు సృష్టించింది. కాగా, రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్ సాధించిన పీవీ సింధు తన 17 ర్యాంకును నిలబెట్టుకుంది. ఇటీవలి కాలంలో చెత్త ఫామ్ లో ఉన్న ఆమె కొరియన్ ఓపెన్ తొలి రౌండ్ లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.