హైదరాబాద్/చెన్నై: రియో ఒలింపిక్స్ 2016లో రజత, కాంస్య పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్ పైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రశంసలు కురిపించారు. మహిళలు ఏమైనా సాధిస్తారనేందుకు వీరు నిదర్శనం అన్నారు.
పీవీ సింధు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ని తాను చూశానని, ఎంతో ఉత్కంఠకు గురయ్యానని, ఆమె స్వర్ణ పతకం కోసం పోరాట పటిమ ప్రదర్శించారన్నారు. ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయినా సింధు చరిత్ర సృష్టించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థితికి చేరుకుంటారని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. సింధుతో పాటు కాంస్య పతకం గెలిచిన రెజ్లర్ సాక్షికి తన అభినందనలు తెలిపారు. వీరిద్దరూ భారత మహిళా శక్తికి నిదర్శనమన్నారు. కఠోర శ్రమే వారిని ఈ స్థితికి చేర్చిందన్నారు.
సింధు పడిన శ్రమ యావత్ భారత హృదయాన్ని తాకిందన్నారు. వీరిద్దరి కృషే భారత్‌ను పతకాల పట్టికలో చేర్చిందన్నారు. యువతులందరికీ వీరిద్దరూ ఇప్పుడు ఆదర్శమన్నారు. జయలలితతో పాటు డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, స్టాలిన్, విజయ్ కాంత్‌లు కూడా పతకాలు గెలిచిన సింధును, సాక్షి మాలిక్‌ను అభినందించారు.
పీవీ సింధును జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హీరో నందమూరి బాలకృష్ణ తదితర ప్రముఖులు కూడా ప్రశంసించారు. రియోలో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పవన్ అభినందనలు తెలిపారు.
బాలకృష్ణ హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. పీవీ సింధు తెలుగు వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. సింధును గౌరవించుకోవడం తెలుగు వారిగా, భారతీయులుగా మన కర్తవ్యమన్నారు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభతో ఒలింపిక్స్‌లో రజతం సాధించి క్రీడల్లో భారతీయులందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు.

సింధు రాకకు హైదరాబాదులో ఘనంగా ఏర్పాట్లు
రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుని సోమవారం హైదరాబాద్ రానున్న పీవీ సింధుకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు శనివారేం నిర్ణయం తీసుకున్నారు.
రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పీవీ సింధు శంషాబాద్ విమానాశ్రయానికి రానుంది. జీహెచ్ఎంసీ స్వాగత ఏర్పాట్లను చేస్తుంది. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లనూ సింధూకు స్వాగత పోస్టర్లతో అలంకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆమెపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాలని, విమానాశ్రయం నుంచి నగరంలోకి భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది. అనంతరం గచ్చీబౌలీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు హాజరై సింధూను అభినందిస్తారు. అన్ని దినపత్రికల్లో సింధూకు స్వాగతం పలుకుతూ ప్రకటనలు ఇవ్వనున్నారు.
కాగా, రియో వెళ్లిన షెడ్యూల్ ప్రకారం సింధు ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ రావాలి. కానీ రజతం గెలిచినందున ఆమెను త్వరగా తీసుకు వచ్చి, అభినందించాలని నిర్ణయించారు. అక్కడే ఉన్న మంత్రులు స్వయంగా ఆమెను తీసుకు రానున్నారు.