భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సత్తా చాటింది. స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు విజృంభించి ఆడింది. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌పై 21-16, 21-8 వరుస సెట్లలో గెలిచి స్విస్ ఓపెన్ 2022 విజేతగా నిలిచింది. రెండు సెట్లోనూ దూకుడుతో ఆడిన సింధు ప్రత్యర్థిపై పూర్తి అధిపత్యాన్ని కనబరిచింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా థాయ్‌లాండ్ అమ్మాయిని చిత్తు చేసింది. అయితే తొలి సెట్లో ఇద్దరు హోరాహోరిగా తలపడ్డారు.
All hail the champion! 👑
— BAI Media (@BAI_Media) March 27, 2022
2️⃣nd super 300 title for @Pvsindhu1 this year 🔥#SwissOpen2022#IndiaontheRise#Badminton pic.twitter.com/EpCqmr0JeS
ఫస్ట్ సెట్ ఆరంభంలోనే సింధు 3-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ పుంజుకుని స్కోర్‌ను సమం చేసింది. ఇద్దరు హోరాహోరిగా తలపడడంతో 9-9 వరకు స్కోర్ సమంగానే ఉంది. ఫస్ట్ సెట్లో సగం టైమ్ ముగిసే సమయానికి చివర్లో కాస్త పుంజుకున్న సింధు 11-9తో అధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో స్కోర్ 16-15తో నిలిచింది. ఈ క్రమంలో తన అనుభవాన్ని అంతా ఉపయోగించిన ఆడిన సింధు 21-16తో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక సెకండ్ సెట్లో పూర్తి అధిపత్యాన్ని కనబర్చిన సింధు 21-8తో ఆ సెట్‌ను కైవసం చేసుకుంది. సెట్‌తోపాటు మ్యాచ్ కూడా గెలిచిన సింధు స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ 49 నిముషాల్లోనే ముగియడం గమనార్హం. అలాగే ఈ సీజన్లో సింధుకు ఇది రెండో ఓపెన్ టైటిల్. గతంలో ఇండియా ఓపెన్‌ను గెలిచింది. కాగా స్విస్ ఓపెన్‌లో సింధు గతేడాది రన్నరఫ్తో సరిపెట్టుకుంది.
అయితే పురుషుల సింగిల్స్ ఫైనల్లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత షట్లర్ ప్రణయ్ ఫైనల్ పోరులో ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టి చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రణయ్‌పై జొనాథన్ 21-12, 21-18 తేడాతో విజయం సాధించి స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ ఓపెన్ విజేతగా నిలిచాడు.