

హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ మరో ఘనతను సాధించారు. అతి పెద్ద డీల్ ను కుదుర్చుకున్నారు. 50 కోట్ల రూపాయల విలువ చేసే డీల్ అది. చైనాకు చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల తయారీ సంస్థ లీ నింగ్.. సింధూను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీనికోసం ఆమెతో 50 కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ప్రకారం..నాలుగేళ్ల పాటు సింధూ ఆ సంస్థ క్రీడా ఉత్పత్తుల యాడ్స్ ల్లో కనిపిస్తారు. స్పాన్సర్‌షిప్ రూపంలో 40 కోట్ల రూపాయలను లీ నింగ్ సంస్థ సింధుకు చెల్లిస్తుంది. క్రీడాసామగ్రి కింద మరో 10 కోట్ల రూపాయలను సింధు అందుకుంటారు. మనదేశ క్రీడారంగానికి సంబంధించినంత వరకూ దీన్ని రెండో అతిపెద్ద డీల్ గా భావిస్తున్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా గరిష్ఠంగా కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 100 కోట్ల రూపాయలు. ప్యూమా సంస్థ 100 కోట్ల రూపాయలతో కోహ్లీతో వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే- ప్రపంచ బ్యాడ్మింటన్ రంగంలో సింధు కుదర్చుకున్న డీల్ అతి పెద్దది. మన రాష్ట్రానికే చెందిన మరో బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కూడా కొద్దిరోజుల కిందటే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల విలువ 35 కోట్ల రూపాయలు. గతేడాది ఫోర్బ్స్ ప్రకటించిన జాబితా ప్రకారం పీవీ సింధూ వాణిజ్య ప్రకటనల్లో నటించడం వల్ల ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్రీడాకారిణుల జాబితాలో ఏడోస్థానంలో నిలిచారు. సింధుకు లీ నింగ్‌తో ఒప్పందం చేసుకోవడం ఇది రెండోసారి.