హైదరాబాద్: 37 ఏళ్ల నిరీక్షణకు కిదాంబి శ్రీకాంత్ తెరదించాడు. ప్రతిష్టాత్మక డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా అవతరించాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21-10, 21-5 తేడాతో లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)పై ఘన విజయం సాధించాడు.
దీంతో శ్రీకాంత్ ఈ ఏడాదిలో గెలిచిన మూడో సూపర్ సిరీస్ ఇది. ఇటీవల ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవడంతో పాటు.. సింగపూర్ ఓపెన్‌లోనూ రన్నరప్‌గా నిలిచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజా టైటిల్‌తో ఏడాదిలోనే మూడు సూపర్ సిరీస్‌లు గెలిచిన షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో ఏడాదిలో 4 సూపర్ సిరీస్ ఫైనల్స్ ఆడిన ఆరో ఆటగాడిగా కూడా 24 ఏళ్ల శ్రీకాంత్ ఘనత సాధించాడు.

25 నిమిషాల వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్ తన ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 1980లో ప్రకాశ్ పదుకొనె తర్వాత ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు.
అంతేకాదు 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టోర్నీలో విజేతగా నిలవగా, ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కిదాంబి శ్రీకాంత్ ఈ సూపర్ సిరీస్‌ను నెగ్గాడు. ఇక, మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున సైనా నెహ్వాల్ (2012లో) టైటిల్ నెగ్గగా, పీవీ సింధు (2015లో) రన్నరప్‌గా నిలిచింది.
కాగా, శనివారం జరిగిన సెమీ ఫైనల్లోనూ హాంకాంగ్‌కి చెందిన వాంగ్ వింగ్‌కీపై 21-18, 21-17తో వరుస సెట్లలో శ్రీకాంత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.