హైదరాబాద్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ స్థానిక ఆటగాడు, ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)పై 14-21, 22-20, 21-7తో విజయం సాధించాడు.

తాజా విజయంతో ఈ ఏడాది అక్సెల్‌సన్ చేతిలో జపాన్ ఓపెన్‌లో, ఇండియా ఓపెన్‌లో తనకు ఎదురైన పరాజయాలకు శ్రీకాంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరోవైపు శ్రీకాంత్ మినహా మిగతా భారత షట్లర్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత గేమ్‌లో అక్సెల్‌సన్ అలవోకగానే గెలిచాడు.
ఇక, రెండో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఒకానొక దశలో అక్సెల్‌సన్ 19-17తో మ్యాచ్‌కు చేరువయ్యాడు. ఈ సమయంలో శ్రీకాంత్ వరుసగా 3 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత 22-20తో గేమ్‌ను ముగించాడు. నిర్ణయాత్మక గేమ్‌లో శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడో గేమ్‌లో 21-7తో అక్సెల్‌సన్‌పై విజయం సాధించాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్) 13-21, 18-21తో టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓడిపోయాడు. ఇక, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 10-21, 13-21తో డిఫెండింగ్ ఛాంపియన్ అకానె యమగూచి (జపాన్) చేతిలో ఓటమిపాలైంది.
మ్యాచ్‌లో అనవసర తప్పిదాలు చాలా చేసిన సైనా ప్రత్యర్థికి అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 29 నిమిషాల్లో అకానె యామగుచి (జపాన్) చేతిలో సైనా ఓటమి పాలైంది. ఇక రెండో సీడ్‌గా డెన్మార్క్ ఓపెన్ బరిలోకి దిగిన పీవీ సింధుకు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. సింధు 17-21, 21-23తో అన్‌సీడెడ్ క్రీడాకారిణి చెన్ యు(చైనా) చేతిలో ఓడిపోయింది.