
చైనా అడ్డుగోడలు తొలగిపోవడంతో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్ షిప్ సైనాదేనని అందరూ భావించారు. కానీ, సైనా నెహ్వాల్ సెమీస్‌లో ఓడింది. దీంతో ఈ టైటిల్ కోసం మరో ఏడాది ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టోర్నీలో సైనా మరోసారి టైటిల్‌కు రెండడుగుల దూరంలో అనూహ్యంగా నిష్క్రమించింది. ఇంటనోన్ చేతిలో మరోసారీ సైనా ఓడిపోయింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఏకైక భారత ఆశాకిరణం, రెండో సీడ్ సైనా 15-21, 19-21 స్కోరుతో ఎనిమిదో సీడ్ ఇంటనోన్ రట్చనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 40 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ప్రత్యర్థికి సమర్పించింది. ఇంటనోన్ చేతిలో సైనా చిత్తవడమిది మూడోసారి. మ్యాచ్‌లో తొలిపాయింట్ సాధించిన సైనా 10-6తో ముందంజ వేసింది.
కాగా ఈ దశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గిన ఇంటనోన్ 12-10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివర్లో వరుసగా ఐదు పాయింట్లు సంపాదించి 21-15తో తొలిగేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సైనా 5-3 ఆధిక్యంలో నిలిచినా ఆనక ప్రత్యర్థిని అడ్డుకోలేకపోయింది. 8-5తో ముందంజ వేసిన ఇంటనోన్ ఏ దశలోనూ సైనాకు అందలేదు. ఆధిపత్యంతో కొనసాగిస్తూ మ్యాచ్‌ను ముగించింది. ఏదేమైనా ఇంగ్లండ్ ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది.