
ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన సైనా 22 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సైనా దూకుడు ముందు స్విస్ సంచలనం తేలిపోయింది. ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వకుండానే చేతులెత్తేసింది. చూడచక్కని షాట్లతో చెలరేగిన సైనా సునాయాస విజయంతో ముందంజ వేసింది. ఇటీవల సాధించిన వరుస విజయాలతో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగిన సైనా ప్రత్యర్థిని చిత్తు చేసింది.
ప్రత్యర్థిని ఏమాత్రం లెక్కచేయని ప్రపంచ ఐదో ర్యాంక్ సైనా మ్యాచ్ ప్రారంభమైన 12 నిమిషాల్లోనే 21-9 తేడాతో తొలిరౌండ్‌ను ముగించింది. అదే స్పూర్తితో రెండోరౌండ్‌లోనే దూకుడును ప్రదర్శించిన సైనా కేవలం మరో 10 నిమిషాల్లోనే ముగించింది. ఓవరాల్‌గా 22 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-9, 21-4 తేడాతో ప్రపంచ 65వ ర్యాంకింగ్ స్విట్జర్లాండ్ క్రీడాకారిణిని మట్టి కరిపించింది. ఒలింపిక్స్‌లో సైనా మరో మ్యాచ్ గ్రూప్-ఇ లో బెల్జియంకు చెందిన లియాన్నే తాన్‌తో నేడు ఢీకొననుంది.