సింగపూర్: భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ సింగపూర్ సూపర్ సిరీస్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి చెందింది. ఇండోనేషియా క్రీడాకారిణి లిండావెని ఫనేత్రి చేతిలో 17-21, 21-13, 21-13 తేడాతో సైనా నెహ్వాల్ పరాజయం చవి చూసింది. ఈ సిరీస్‌ను జోరుగా ఆరంభించిన సైనా క్వార్టర్‌లో ఇంటి దారి పట్టి భారత అభిమానుల ఆశలను నీరుగార్చింది.
కాగా సైనా నెహ్వాల్ గురువారం ఈ సిరీస్ శుభారంభం చేసింది. గురువారం సైనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకొచ్చి ఆశలు రేపింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో మాజీ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా 16-21, 21-16, 21-9తో జపాన్‌కు చెందిన ఎరికో హిరోస్‌పై చెమటోడ్చి నెగ్గింది.

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సైనా క్వార్టర్స్‌లోనే చెమటోడ్చింది. అనామక క్రీడాకారిణి హిరోస్‌తో జరిగిన పోరులో అతికష్టమ్మీద నెగ్గింది. ఈ రోజు ఫనేత్రి చేతిలో ఓటమి చవి చూసి ఇంటి దారి పట్టింది.
ఇటీవల థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్‌లో కూడా మహిళా సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకోవాలన్న భారత స్టార్ షట్లర్ సైనా ఆశలు వమ్ము అయిన విషయం తెలిసిందే. ఈ టోర్నీకి చైనా టాప్ సీడ్స్ దూరమైనా సైనా ఫైనల్ చేరడంలో విఫలమై అనూహ్యంగా క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. అప్పుడు టాప్ సీడ్ సైనా క్వార్టర్స్‌లో సింగపూర్ షట్లర్ జువాన్ గు చేతిలో 21-13, 12-21, 18-21తో పరాజయం చవి చూసింది.