న్యూఢిల్లీ: ఐబియల్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో సీనియర్ సైనా నెహ్వాల్ ముందు యువ కెరటం పివి సింధు నిలువలేకపోయింది. ఆరంభంలో దూకుడుగా ఆడి పైచేయి సాధించిన సింధు ఆ తర్వాత సైనాను ధీటుగా ఎదుర్కోలేకపోయింది. తొలి గేమ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. తర్వాతి మ్యాచులో సింధు పూర్తిగా చేతులెత్తేసింది.
వరుస గేమ్‌ల్లో సింధును ఓడించి సైనా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఐబీఎల్‌లో భాగంగా హైదరాబాదీల మధ్య గురువారం పోటీ జరిగింది. హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు సారథ్యం వహిస్తున్న సైనా 21-19, 21-8తో అవధ్ కెప్టెన్ సింధుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 3-2తో అవధ్‌పై గెలుపొందింది. 38 నిమిషాల పాటు ఈ పోరు సాగింది.తొలి గేమ్‌లోని ఓ దశలో ఒక్కసారిగా పుంజుకున్న నెహ్వాల్ 17-15 ఆధిక్యంలో నిలిచింది. సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరు సమం చేసినా ఆనక సైనాను అడ్డుకోలేకపోయింది.

అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్‌లో గురుసాయి దత్‌కు నిరాశ ఎదురైంది. టనోంగ్సక్ (హైదరాబాద్) 21-1, 21-7తో గురుసాయి (అవధ్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్‌లో అవధ్ జోడీ గెలుపొందింది. తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఏపీ ఆటగాడు శ్రీకాంత్ 21-17, 21-19తో హైదరాబాద్ హాట్‌షాట్స్ ఆటగాడు అజయ్ జయరామ్‌ను ఓడించి అవధ్‌ను 2-2తో సమంగా నిలిపాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాద్ జోడీ షెమ్, ప్రద్న్య గాద్రె 21-9, 19-21, 11-8తో మార్కిస్, సప్సిరీ (అవధ్)పై నెగ్గారు.
సింధు, సైనాల మ్యాచుకు ప్రేక్షకులు పెద్దయెత్తునే వచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మ్యాచ్‌ను తిలకించారు. సైనా, సింధులతో మాట్లాడారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సింధును అభినందించారు. ముంబై మాస్టర్ యజమానులు టాలీవుడ్ హీరో నాగార్జున, చాముండేశ్వరీ నాథ్ పోటీలు తిలకించారు.