హైదరాబాద్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ నిచావోన్ జిందపోల్ (థాయ్‌లాండ్)పై 22-20, 21-17 తేడాతో విజయం సాధించింది.
హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం పెద్దగా ప్రతి ఘటనను ఎదుర్కోలేదు. ఇక క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి మితానితో సింధు తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ క్వార్టర్స్‌కు చేరగా.. పారుపల్లి కశ్యప్ మాత్రం ప్రిక్వార్టర్స్‌లో ఇంటిదారి పట్టాడు.

పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సమీర్ వర్మ హాంకాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కీ విన్సెంట్‌పై 21-19, 21-13తో విజయం సాధించాడు. 41 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సమీర్ వర్మ ఏకపక్ష విజయం సాధించారు. కాగా, పారుపల్లి కశ్యప్ సన్ వాన్ చేతిలో 16-21, 21-17, 16-21 తేడాతో కశ్యప్ ఓటమి పాలయ్యాడు.