
హైదరాబాద్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భాగంగా జపాన్‌కు చెందిన ప్రపంచ నంబర్ 14 ర్యాంకు క్రీడాకారిణి ఆయా ఒహోరీపై 26-24, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది.
తొలి గేమ్ ఆరంభంలో తడబడిన పీవీ సింధు ఆ తర్వాత అనుభవంతో అద్భుతంగా పుంజుకుంది. దీంతో తొలి గేమ్‌లో ఇరువురు తమ ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే, రెండో గేమ్‌లో సింధు పైచేయి సాధించి మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
తొలి రౌండ్లో వాంగ్ జూ వీ(చైనీస్ తైపీ)తో పోరులో ప్రణీత్ 12-21, 7-21 తేడాతో ఓడిపోయాడు. ఏకపక్షంగా సాగిన పోరులో ప్రణీత్ ఏ దశలోనూ వాంగ్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు. ఇదే టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, రాంకీరెడ్డి, చిరాగ్ షెట్టీ తమ తొలి రౌండ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మరోవైపు ఇప్పటికే తొలి రౌండ్లో విజయం సాధించిన సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్ 21-12, 21-16తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ రెండో సీడ్ యమగూచి (జపాన్)తో తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ తొలిరౌండ్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-కుహు గార్గ్ జంట తొలి రౌండ్లో 9-21, 10-21తో జితింగ్-డూ యీ (చైనా) చేతిలో ఓటమిపాలైంది.