
హైదరాబాద్ : ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ (బీడబ్ల్యూఎఫ్ )లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ మ్యాచ్‌లలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, అనేక సిరీస్‌ల విజేత కిదాంబి శ్రీకాంత్ ఆడారు. సింధు శుభారంభం చేయగా.. అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు చుక్కెదురైంది.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రౌండ్ ఏకపక్షంగా సాగినా రెండో రౌండ్ కొద్దిగా కష్టతరంగా జరిగింది. మహిళల సింగిల్స్ గ్రూపు-ఎ మ్యాచ్‌లో సింధు 21-11, 16-21, 21-18తో హి బింగ్జియావొ (చైనా)పై విజయం సాధించింది. ఒక గంటా 4 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధుకు బింగ్జియావొ గట్టి పోటీనిచ్చింది. ఇద్దరి మధ్యా పోటీ హోరాహోరీగా జరిగింది.

పురుషుల సింగిల్స్ గ్రూపు-బి పోరులో శ్రీకాంత్‌కు ప్రపంచ స్థాయిలో మొదటి ర్యాంకు పొందిన అక్సెలెన్‌తో మ్యాచ్ పడింది. హోరాహోరీగా జరిగిన రెండు రౌండ్లలో శ్రీకాంత్ 13-21, 17-21 గా స్కోరును నమోదు చేశాడు. దీంతో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఆరంభం నుంచి చివరి వరకు శ్రీకాంత్‌కు పాయింట్ గెలవడం బహుకష్టమై పోయింది.
గురువారం జరిగే మ్యాచ్‌ల్లో సయాక సాటొ (జపాన్)తో సింధు, చౌ తీన్ చెన్ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ తలపడనున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.