హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు ఆసుపత్రి పాలయ్యారు. ఆమె తన మోకాళ్ల ట్రీట్మెంట్ కోసం హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరారు. రియో ఒలింపిక్స్ 2016లో ఆమె ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. గాయాల కారణంగా ఆమె మంచి ప్రదర్శన కనబర్చలేకపోయారు.
26 ఏళ్ల సైనా నెహ్వాల్ రియో ఒలింపిక్స్‌లో సెకండ్ గ్రూప్‌లో ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారిణి మరియా ఉలితినా పైన ఓటమి చవి చూసింది. దీంతో రియో నుంచి బయటకు వచ్చింది.

గాయాల కారణంగా సైనా నెహ్వాల్ రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, మరియాతో మ్యాచ్ సందర్భంగా గాయాలయ్యాయని సైనా తండ్రి హర్వీర్ సింగ్ చెప్పారు. కాగా, సైనా కుడి కాలుకు గాయమైనట్లుగా తెలుస్తోంది.
డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్‌కు చెందిన వివరాలు వెల్లడించలేదని, సైనా నెహ్వాల్ విషయమై తాను రేపు మాట్లాడుతానని, ఈ రోజు మాట్లాడలేనని తండ్రి చెప్పారు. ఆమెను హైదరాబాద్ వైద్యులు ముంబైకి రిఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఆమె ముంబై ఆసుపత్రికి వెళ్లనున్నారు.