BWF World Championships: ఫ్రాన్స్ లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ 2025లో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ భారత జోడీ చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియూ యీ జోడీ చేతిలో ఓడిపోయింది. దీంతో ఫైనల్ కు ప్రవేశించే అవకాశం కోల్పోయి కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్
మ్యాచ్ మొదటి రెండు గేమ్స్ లో భారత జోడీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తొలి గేమ్ లో సాత్విక్-చిరాగ్ 9-3 ఆధిక్యాన్ని సాధించారు. అయితే ఆ తర్వాత చైనా జోడీ పుంజుకుని 21-19తో తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లో భారత జోడీ మళ్లీ తమ పట్టు నిలుపుకుని 21-18తో గెలిచి మ్యాచ్‌ను సమంచేసింది. మూడో, చివరి గేమ్‌లో చైనా జోడీ మరోసారి తమ ఆటను మెరుగుపరుచుకుని 21-12తో భారత జంటను ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ ఓటమితో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. ఫైనల్లో చెన్ బో యాంగ్, లియూ యీ జోడీ దక్షిణ కొరియాకు చెందిన సేయో సియుంగ్-జే, కిమ్ వోన్-హోతో తలపడనుంది.

ముగిసిన భారత బృందం ప్రయాణం
ఈ ఓటమితో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బృందం ప్రయాణం ముగిసింది. గతంలో ఈ భారత జోడీ ఇండోనేషియా, సింగపూర్, చైనా ఓపెన్ టోర్నమెంట్‌లలో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. సాత్విక్-చిరాగ్ జోడీకి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇది రెండో కాంస్య పతకం. గతంలో 2022లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఈ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.