
స్విస్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి - చిరాగ్ శెట్టి మరో పతకంతో ఆకట్టుకున్నారు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు అద్భుతమైన ఆటతో స్విస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గారు. చైనాకు చెందిన రెన్ జియాంగ్ యూ, టన్ క్వియాంగ్ జోడీతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు భారత జోడీనే విజయం వరించింది. ఈ విజయంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రెండు జోడీలు 54 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో చివరకు 21-19, 24-22తో భారత జోడీ విజయం సాధించింది. ఈ విజయంతో 2023లో సాత్విక్ - చిరాగ్ జోడీ తొలి పతకం సాధించింది. ఇప్పటి వరకు సాత్విక్ - చిరాగ్ జంట తాము ఆడిన ఐదు వరల్డ్ టూర్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గారు. అంతకుముందు శనివారం జరిగిన సెమీ ఫైనల్లో కూడా రెండో సీడ్ సాత్విక్ - చిరాగ్ జోడీ అద్భుతంగా ఆడింది.
ఈ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన ఒంగ్ యవ్సిన్, టియో ఏఈపై 21-19, 17-21, 21-17 తేడాతో అనూహ్యంగా విజయం సాధించారు. ఈ విజయంతో స్విస్ ఓపెన్ ఫైనల్ చేరిన సాత్విక్ - చిరాగ్.. పతకంపై ఆశలు పెంచారు. ఈ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ ఎవరూ రెండో రౌండ్ దాటలేకపోయారు. గతేడాది మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన సింధు ఈసారి తీవ్రంగా నిరాశ పరిచింది.
ఈ క్రమంలో కేవలం సాత్విక్ - చిరాగ్ జోడీపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇలా అభిమానులు, కోచ్‌లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇద్దరు చక్కగా నిలబెట్టారు. పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచి మరోసారి తమ సత్తా చాటారీ ఇద్దరూ. అంతకుముందు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్ గెలుస్తారని అనుకున్న సాత్విక్ - చిరాగ్ ఆ పతకం సాధించలేకపోయారు. ఇప్పుడు స్విస్ ఓపెన్ విజయంతో ఈ ఏడాది తొలి పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.