Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సొంతగూటికి సైనా: ట్విట్టర్‌లో వెల్లడి, అభిమానుల సంతోషం

హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ తన సొంత గూటికి తిరిగొచ్చింది. ఈ విషయాన్ని సైనానే స్వయంగా ప్రకటించింది. తాజాగా సైనా ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. స‌రిగ్గా మూడేళ్ల కింద‌ట గోపీచంద్‌ను కాద‌ని బెంగ‌ళూరు కోచ్‌ విమ‌ల్ కుమార్‌తో జ‌త క‌ట్టిన సైనా ఇప్పుడు శిక్షణ కోసం గోపీచంద్ అకాడమీలో చేరింది.

గతవారం గ్లాస్గోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా గోపీచంద్‌తో సైనా మాట్లాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ ముగిసిన వెంట‌నే సైనా హైద‌రాబాద్ తిరిగొచ్చిన గోపీచంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించింది.

ట్విట్టర్‌లో సైనా ఇలా:

'హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను మీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సుదీర్ఘకాలం తర్వాత తిరిగి గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందేందుకు సిద్ధమయ్యా. దీనిపై ఇప్పటికే గోపీ సార్‌తో చర్చలు ముగిశాయి. నాకు తిరిగి శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్న గోపీ సార్‌కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతని ఆధ్వర్యంలో నా కెరీర్లో మరిన్ని లక్ష్యాలను చేరుకుంటానని భావిస్తున్నా. మూడు సంవత్సరాలుగా నాకు శిక్షణ ఇచ్చిన విమల్‌ సార్‌కి ధన్యవాదాలు. అతని ఆధ్వర్యంలోనే నేను ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకును అందుకున్నాను. అంతేకాదు 2015, 2017 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలతో పాటు ఎన్నో సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. తిరిగి సొంతగూటికి చేరుకోవడం, హైదరాబాద్‌లో శిక్షణ పొందడం ఎంతో సంతోషంగా ఉంది' అని సైనా ట్విటర్‌లో పేర్కొంది.

అభిప్రాయభేదాల కారణంగా మూడేళ్ల క్రితం గోపీచంద్ అకాడమీని వీడిన సైనా నెహ్వాల్.. 2014, సెప్టెంబర్ 2 నుంచి బెంగళూరులో విమల్ కుమార్ దగ్గర శిక్షణ పొందింది. విమల్ దగ్గర ఉన్న సమయంలోనే సైనా వరల్డ్ నెంబర్ వన్‌గా అవతరించింది.

Saina starts training at Gopi's academy again

అంతేకాదు విమ‌ల్ కోచింగ్‌లో సైనా మంచి విజయాలను కూడా సాధించింది. ఆల్ ఇంగ్లండ్ ఫైనల్ చేరడంతోపాటు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించింది. ఆ తర్వాత గాయాల కారణంగా ఆమె ఆటతీరు కాస్త మందగించింది. అంతకుముందు గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన సైనా అంతర్జాతీయ స్దాయిలో అద్భుత ప్రదర్శన చేసింది.

కోచ్‌గా గోపీచంద్, క్రీడాకారిణిగా సైనా.. దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్‌కు చక్కటి గుర్తింపు తీసుకొచ్చారు. అంతేకాదు ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన తొలి భారత షట్లర్‌గా సైనా నెహ్వాల్ రికార్డు సాధించింది. అయితే గత మూడేళ్లుగా సైనా తన కోచ్ గోపీచంద్‌కు దూరంగా ఉంటూ వచ్చింది.

వీరిద్దరి మధ్య మాటల్లేకపోయినా ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానం, పరస్పర గౌరవం మాత్రం తగ్గలేదు. దీంతో సైనా తిరిగి మళ్లీ తన సొంత గూటికి అంటే పాత గురువు దగ్గరికే వచ్చింది. సైనా దూరమైన ఈ మూడేళ్ల కాలంలో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ లాంటి శిష్యులను గోపీచంద్ తీర్చిదిద్దారు.

నిజానికి ఈ మధ్య కాలంలో వీరి ఆటతీరుతో పోలిస్తే సైనా వెనుకబడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న వారితోనే గోపీచంద్ బిజీగా ఉంటే, సైనాపై మరి సైనాపై ప్రత్యేక శ్రద్ధ ఎలా వహిస్తారో చూడాలి. కానీ సైనాపై గోపీచంద్‌ మనసులో ప్రత్యేకస్ధానం ఉండటం వల్లే ఆమెను సాదరంగా ఆహ్వానించారని అంటున్నారు.

నిజానికి 2014లో సైనా గోపీచంద్ అకాడమీని వదిలి వెళ్లిన సందర్భంలో చాలా మంది బాధపడిన సందర్భం కూడా. మళ్లీ ఇప్పుడు వాళ్లిద్దరూ కలవడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని అభిమానుల‌కు కోరుకుంటున్నారు.

2010లోనూ కామ‌న్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత సైనా గోపీచంద్‌ను కాద‌ని భాస్క‌ర్ బాబు ద‌గ్గ‌రికి కోచింగ్‌కు వెళ్లినా.. కొన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ గోపీ అకాడ‌మీకే తిరిగి రావడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+