హైదరాబాద్: తాను సింగపూర్ ఓపెన్‌లో ఆడటంలేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు తెలిపారు. గత నెలలో మూడు టోర్నమెంట్లు ఆడాననీ తెలిపింది. అందులో రెండింటిలో ఫైనల్స్ వరకు చేరుకున్నానని.. ఒకటి గెలిచానని చెప్పింది.
వరుస టోర్నమెంట్ల వల్ల తనకు విశ్రాంతి దొరకడం లేదనీ.. అందుకే సింగపూర్ ఓపెన్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని ఆసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మెరుగ్గా ఆడాలనుకుంటున్నట్లు సైనా వెల్లడించింది.

ఇటీవలే ఇండియా ఓపెన్ సాధించి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన సైనా.. మలేషియా ఓపెన్‌లో సెమీ ఫైనల్లో ఓటమి పాలై తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. అయితే తాను మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని సాధిస్తానని సైనా ధీమా వ్యక్తం చేసింది.
కాగా, మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా సింగపూర్ ఓపెన్ టైటిల్ కోసం పోటీ పడటం లేదు. గాయం కారణంగా ఆమె సింగపూర్ ఓపెన్‌కు దూరమయ్యారు. దీంతో భారత బ్యాడ్మింటన్ జట్టుకు శ్రీకాంత్ నాయకత్వం వహించనున్నాడు.