హైదరాబాద్: మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు నంబర్ వన్ ర్యాంకు సాధిస్తుందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే జోస్యం చెప్పారు. సరైన శిక్షణ, సరైన షెడ్యూల్, టోర్నీల మధ్య విశ్రాంతి ఉండేలా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఆమె సరైన దిశగానే వెళ్తున్నట్టు భావించాల్సి ఉంటుదని అన్నారు.
ఆ విషయం సింధుతో పాటు ఆమె గోచ్ గోపీచంద్‌కు కూడా బాగా తెలుసని అనుకుంటున్నానని అన్నారు. మరో ఐదారేళ్లపాటు మెరుగైన ఆటతీరు ప్రదర్శించే సత్తా ఆమెకు ఉందని ప్రకాశ్ పదుకొనే అన్నారు. ఆమె సరైన సమయంలో తన పతాక స్థాయిని అందుకుందని అగ్రశ్రేణి షట్లర్లందరినీ ఓడించిందని అన్నారు.

ఇక ఇప్పుడు ఆమె నిలకడగా ఆడుతుందా లేదా అన్నదే కీలకమని అని పేర్కొన్నారు. ఆమె ప్రదర్శన నిలకడగా ఉంటే నంబర్ వన్ ర్యాంకుని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు. రియో ఒలింపిక్స్ నుంచి సింధు పూర్తిగా మారిపోయింది. చాలా ఆత్మవిశ్వాసంతో కనబడుతోందని ఆయన అన్నారు.
అంతర్జాతీయ టోర్నీల కోసం సన్నద్ధమయ్యే తీరు చాలా బాగుందని చెప్పారు. ఆమె కోరుకున్న విధంగానే టోర్నీలకు సిద్ధమవుతుండటంతో ఒత్తిడి ఉండటం లేదని చెప్పిన ఆయన చాలా సింపుల్‌గా ఆడగలుగుతున్నది అని అన్నారు. రెండు రోజుల క్రితం నెంబర్‌వన్ ర్యాంకుని సాధించడమే తన లక్ష్యమని సింధు చెప్పిన నేపథ్యంలో ప్రకాశ్ పదుకొనే ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అయితే సైనా కోచ్ విమల్ కుమార్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో ఈ ఇద్దరు క్రీడాకారిణులూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసిస్తారన్నాని అన్నాడు. అయితే ప్రకాశ్ వ్యాఖ్యలపై నేను స్పందించను. కానీ సింధు.. సైనాకు గట్టిపోటీదారు అని మాత్రం చెప్పగలనని అన్నారు. సైనా త్వరలోనే విజయాలబాట పడుతుందని మళ్లీ పెద్ద టోర్నీలను గెలిచి చూపెడుతుంది అని విమల్ కుమార్ వ్యాఖ్యానించాడు.