భోపాల్: తన జీవితచరిత్ర ఆధారంగా సినిమా తీయాలనుకుంటే అభ్యంతరం లేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేర్కొంది. అయితే ఆ సినిమాలో తన వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యమివ్వడం కన్నా, బ్యాడ్మింటన్ ఆటకు ఊతమిచ్చేలా రూపొందితే బాగుంటుందని సైనా తెలిపింది.
నా జీవితంలోని అంశాలన్నీ అభిమానులందరికీ ఇప్పటికే తెలుసనుకుంటున్నానని తెలిపింది. అందుకే, ఒకవేళ జీవితకథ తెరకెక్కించాలనుకుంటే, ఆ సినిమా నాకన్నా బ్యాడ్మింటన్‌కు ప్రాచుర్యం కల్పించేదిగా ఉంటే మంచిదనుకుంటున్నానని తెలిపింది.

తన జీవిత చరిత్రపై తీసే చిత్రంలో లీడ్ రోల్స్‌ను బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, దీపికా పదుకొనె పోషించాలని సైనా కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే క్రీడాకారులు మిల్కా సింగ్, మేరీ కోమ్‌లపై వచ్చిన సినిమాలు విజయవంతమైన విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సైనా ఈ మేరకు స్పందించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్.. లండన్ ఒలింపిక్స్ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా సైనాకు రూ. 50లక్షలు అందజేశారు.