
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్త, పురుషుల సింగిల్స్ స్పెషలిస్ట్ పారుపల్లి కశ్యప్ పేరును టోక్యో ఒలింపిక్స్ జాబితా నుండి మినహాయించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (భాయ్) తీసుకున్న నిర్ణయంపై సైనా మనసు నొచ్చుకుంది. దీంతో ఆగస్టు 7న పుల్లెల గోపీచంద్ అకాడమీలో ప్రారంభం ఆయిన జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరంలో ఆమె ఇంకా చేరలేదు.
అయితే గోపీచంద్ అకాడమీకి సమీపంలో ఉన్న మరో బ్యాడ్మింటన్ శిబిరంలో సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారట. వీరితో పాటు మరికొందరు కూడా అక్కడే శిక్షణ ఆరంబించారట. ఇక ఓ రెండు వారాల తరువాత సాయ్ కేంద్రంలోని శిబిరంలో సైనా చేరనున్నారని సమాచారం. మెరిట్ ఆధారంగా కశ్యప్‌ను శిబిరంలోకి అనుమతించాలని అధికారులను సైనా వ్యక్తిగతంగా కోరినట్లు తెలుస్తోంది. అయితే అధికారుల నుంచి ఆమెకు అనుకూలమైన స్పందన రాలేదట.
మరోవైపు జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరంలో తనకు చోటు కల్పించకపోవడంపై పారుపల్లి కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు తనకూ ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. 'హైదరాబాద్‌లోని సాయ్-గోపీచంద్ అకాడమీలో 8 మందినే శిక్షణకు అనుమతించడం అశాస్త్రీయంగా అనిపిస్తోంది. ఈ 8 మంది ఒలింపిక్ ఆశావాహులు ఎలా అయ్యారు?. వీరిలో ముగ్గురికి మాత్రమే ఒలింపిక్ బెర్తులు దాదాపు ఖాయమయ్యాయి. శ్రీకాంత్, మహిళల డబుల్స్ జోడీతో సహా మిగతా వారందరికీ ఒలింపిక్స్ అవకాశం కష్టంగా ఉంది' అని కశ్యప్ అన్నాడు.
'ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాది 23వ స్థానం. సాయిప్రణీత్, శ్రీకాంత్‌ల తర్వాత అత్యుత్తమ ర్యాంకు నాదే. అయినా శిక్షణ శిబిరానికి నన్ను పరిగణలోకి తీసుకోలేదు. జాబితా తయారు చేసిన సాయ్ అధికారులతో మాట్లాడాలని గోపీచంద్ భాయ్ సలహా ఇచ్చాడు. జాబితా రూపకల్పనకు అనుసరించిన విధివిధానాలేంటని సాయ్ డీజీని అడిగా. మరుసటి రోజు సాయ్ సహాయక డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. సాయ్‌తో, భారత బ్యాడ్మింటన్ సంఘంతో ఉన్నతాధికారులు మాట్లాడారని.. ఈ 8 మందికి మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశముందంటూ వారు చెప్పారు' అని పారుపల్లి కశ్యప్ తెలిపాడు.
'అధికారుల మాటలు విని నాకు వింతగా అనిపించింది. క్రీడాకారులు భద్రత దృష్ట్యా ఒలింపిక్స్ వరకు 8 మందే ప్రాక్టీస్ చేస్తారన్నారు. ప్రస్తుతం ఎవరూ అకాడమీలో ఉండట్లేదు. బయట వేరేవాళ్లను కలుస్తున్నారు. క్రీడాకారుల భద్రతపై వారి వివరణ నాకు అర్థం కావడం లేదు. శిక్షణ శిబిరంలో 9 కోర్టులు ఉన్నా.. నలుగురే సాధన చేస్తున్నారు. నాలాగే అర్హత సాధించేందుకు తక్కువ అవకాశమున్న లక్ష్యసేన్ బెంగళూరులో అందరితో కలిసి సాధన చేస్తున్నాడు. మిగతా వారితో ప్రాక్టీస్ చేసే అవకాశమే లేకపోతే ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధిస్తా' అని కశ్యప్ ప్రశ్నించాడు.