బీజింగ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పైన 21-12, 22-20 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. కెరీర్‌లో తొలిసారి చైనా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించింది. హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందనలు తెలిపారు.
కాగా, సైనా నెహ్వాల్ చైనా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. హైక్సినా ఒలింపిక్ స్పోర్ట్ సెంటర్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో చైనాకి చెందిన లియు జిన్‌పై 21-17, 21-17 పాయింట్ల తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. 49 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. సైనా ప్రస్తుతం ఐదవ ర్యాంకులో ఉంది.

శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరో సీడ్ సైనా 21-13, 17-21, 21-5 పాయింట్లతో ది సుయో (చైనా)పై విజయం సాధించింది. 59 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చెరో గేమ్ నెగ్గి సమంగా నిలిచారు.
శ్రీకాంత్ సంచలనం
చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల్ టైటిల్ కూడా భారత్ ఖాతాలోకే చేరింది. ఆదివారం జరిగిన పురుషుల విభాగం టైటిల్ పోరులో కిదాంబి శ్రీకాంత్ రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్‌ను 21-19, 21-17తో వరుస గేముల్లో మట్టికరిపించాడు. అటు, మహిళల టైటిల్‌ని సైనా నెహ్వాల్, ఇటు పురుషుల టైటిల్‌ని శ్రీకాంత్ నెగ్గారు. ఇరువురు కూడా హైదరాబాదీయులే కావడం గమనార్హం. శ్రీకాంత్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.