హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను శుక్రవారం కలిసి తన ముచ్చట తీర్చుకుంది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. షారుఖ్ చాలా సృజనాత్మకత కలిగిన వ్యక్తి అని, ఆయన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అదేవిధంగా 'దిల్‌వాలే' షూటింగ్ చూపించినందుకు చిత్ర దర్శకుడు రోహిత్‌శెట్టికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను సైనా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తాజాగా సైనా నెహ్వాల్ బాలీవుడ్‌లో ఓ టీవీ సిరియల్‌లో నటిస్తోంది. దీంతో షారుఖ్‌ను కలిసి ఏమైనా సలహాలు తీసుకోవాలని అనుకుందో ఏమో?
షారూఖ్ తాజా చిత్రం 'దిల్ వాలే' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈవిషయం తెలిసి షారూఖ్ ను కలవాలని ఉందని సైనా ట్వీట్ చేసింది. 'హలో సర్.. మీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని తెలిసింది. మిమ్మల్ని కలవాలని ఉంది' అని సైనా ట్వటర్ లో పోస్ట్ చేసింది.
దీనికి వెంటనే స్పందించిన షారుఖ్ ఖాన్ సమాధానమిస్తూ 'నిన్నెప్పుడు కలవాలో చెప్పు' అంటూ అడిగాడు. వెంటనే సైనా శుక్రవారం కలుస్తానని సమాధానం ఇచ్చింది. ఈ సినిమాలో షారూఖ్ సరసన కాజోల్ నటిస్తోంది. ఇప్పటికే సైనా ఆ ఫోటోను ట్విటర్‌లో ట్వీట్ చేసింది.
కాజోల్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపిన సైనా, రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'దిల్ వాలే' సినిమాలో వరుణ్ ధావన్, కృతి సనన్, బొమన్ ఇరానీ, వినోద్ ఖన్నా, సంజయ్ మిశ్రా, జానీ లివర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.