తిరుమల: బాడ్మింటన్ క్రీడాకారులు రాణించాలంటే క్రమశిక్షణ అవసరమని హైదరాబాదీ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. శుక్రవారం తిరుపతిలోని శ్రీనివాస క్రీడా ప్రాంగణాన్ని సైనా సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కష్టపడితేనే అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు.
తిరుపతిలో బాడ్మింటన్ క్రీడకు మంచి సౌకర్యాలు ఉన్నాయన్నారు. బాడ్మింటన్‌లో రాణించాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి వారి శక్తి సామర్ధ్యాలపై నమ్మకం ఉంటేనే ఏ క్రీడలోనైనా రాణిస్తారన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కాసేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ క్రీడలు, యువనజ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్ జైన్ పాల్గొన్నారు.