న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తెలుగు తేజాలు సత్తాచాటారు. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకుని దూకుడుమీదున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, యువ సంచలనం కిడాంబి శ్రీకాంత్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా 21-16, 21-14తో రచనోక్ ఇంటనాన్ (థాయ్‌లాండ్)ను వరుస గేముల్లో మట్టికరిపించింది. పురుషుల ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 18-21, 21-13, 21-12తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించి టైటిల్ నెగ్గాడు.
ప్రారంభం నుంచే సైనా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్‌లో 5-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సైనా ఏమాత్రం వెనుదిరిగి చూడలేదు.కోర్టులో సైనా పాదరసంలా కదులుతూ పవర్‌ఫుల్ స్మాష్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. సెమీస్‌లో కరోలినా మారిన్ (స్పెయిన్)పై చెమటోడ్చి నెగ్గిన మూడో సీడ్ రచనోక్ ఈ మ్యాచ్‌లో కొంత అలసినట్టుగా కనిపించింది. సైనాకు మద్దతుగా స్టేడియం మార్మోగడం కూడా ఆమె ఏకాగ్రతపై ప్రభావం చూపింది. దీంతో మాజీ ప్రపంచ చాంపియన్ అనవసర తప్పిదాలు చేయడంతో సైనా 11-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

బ్రేక్ తర్వాత రచనోక్ తన సహజ ఆటను ప్రదర్శించింది. నెట్ వద్ద వేగంగా కదులుతూ డ్రాప్ షాట్లతో గట్టిపోటీ ఇచ్చింది. 10-12తో సైనా ఆధిక్యాన్ని భారీగా తగ్గించింది. కానీ నెహ్వాల్ వెంటనే కోలుకుని ప్రత్యర్థి ఎత్తులను తిప్పికొట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా స్మాష్‌లతో విరుచుకుపడింది. వరుసగా 8 పాయింట్లు నెగ్గి 20-12తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి పట్టువీడకుండా నాలుగు గేమ్ పాయింట్లు కాచుకున్నా 21-16తో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక రెండో గేమ్ ఆరంభం నుంచే నెహ్వాల్ దూకుడు ప్రదర్శించింది. 5-0తో ఆధి క్యంలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత ఇంటనాన్ అద్భు తమైన షాట్లతో కొన్ని పాయింట్లు సంపాదించినా సైనా 11-6తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత 17-11తో మ్యాచ్ పాయింట్ దిశగా సాగుతున్న సైనాను రచనోక్ అడ్డుకుంది. 18-14తో స్కోరును సమం చేయాలని తీవ్రంగా ప్రతిఘటించిం ది. కానీ జోరు మీదున్న సైనా 21-14తో రెండో గేమ్ గెలుచుకుని తొలిసారిగా ఇండియా ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది
సెమీస్‌లో చైనా ఆటగాడిపై సునాయాసంగా నెగ్గిన శ్రీకాంత్‌కు ఫైనల్లో అక్సెల్సన్ రూపంలో గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో శ్రీకాంత్, అక్సెల్సన్‌లు హోరాహోరీగా తలపడ్డారు. కీలక సమయాల్లో తడబడ్డ శ్రీకాంత్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నాడు.
రెండో గేమ్‌లో పుంజుకున్న శ్రీకాంత్ పదునైన స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో విరుచుకుపడి 21-13తో సులభంగా గేమ్‌ను గెలుచుకున్నాడు. కానీ, మూడో గేమ్‌లో అక్సెల్సన్ 11-9 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే శ్రీకాంత్ వెంటనే పుంజుకొని 12-12తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత అద్భుతమైన ఆటతో వరుసగా 9 మ్యాచ్ పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ తన సొంతం చేసుకున్నాడు.