
హైదరాబాద్: కాలి గాయం నుంచి కోలుకున్న సైనా నెహ్వాల్ చురకత్తిలా దూసుకుపోయింది. ప్రత్యర్థి ఎవరైనా ఒకటే. గెలుపే ముఖ్యం అంటూ సాగిన పోరాటంలో సైనా నెహ్వాల్, ఒలింపిక్ పతకదారు అయిన పీవీ సింధును ఓడించింది.
ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సైనా తెలుగు తేజం పీవీ సింధును (రెండో సీడ్)లో సునాయాసంగా ఓడించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 21-13, 21-19 తేడాతో సింధును సైనా మట్టికరిపించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సైనా రెండో గేమ్‌లో శ్రమించాల్సి వచ్చింది.
మొత్తానికి రెండో గేమ్‌ను గెలుచుకుని సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో థాయిలాండ్‌కు చెందిన నాలుగో సీడ్ క్రీడాకారిణి రాట్చానోక్ ఇంటనాన్‌తో సైనా నెహ్వాల్ తలపడుతుంది. అంతర్జాతీయ టోర్నమెంట్లలో సైనా, సింధు తలపడటం ఇది మూడో సారి. గతంలో తలపడిన రెండు టోర్నమెంట్లు స్వదేశంలో జరిగినవే.
2014లో సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నీలో సింధును సైనా ఓడించింది. ఆ తరవాత 2017లో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సైనాపై సింధు ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా జకర్తాలో జరిగిన పోరులో మరొకసారి సైనా గెలిచి ముఖాముఖి ఆధిక్యాన్ని 2-1కు పెంచుకుంది. ఇదిలా ఉంటే ఒకసారి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కూడా సైనా, సింధు ముఖాముఖిగా రెండుసార్లు తలపడ్డారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.