
హైదరాబాద్: ఫూసూ వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ సూపర్ సిరిస్ టోర్నీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ సత్తా చాటింది. ఆమె రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో 11వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ అమెరికాకు చెందిన బైవెన్ జాంగ్‌పై 21-12, 21-13 తేడాతో విజయం సాధించింది.
30 నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా ఆరంభం నుంచే తన దూకుడుని ప్రదర్శించింది. బైవెన్ జాంగ్‌పై సైనాకు ఇది మూడో విజయం కావడం విశేషం. రెండో రౌండ్‌లో సైనా నెహ్వాల్ జపాన్‌కు చెందిన ఐదో సీడ్ యమగుచితో తలపడనుంది. గతంలో వీరిద్దరూ నాలుగుసార్లు తలపడగా ఒక మ్యాచ్‌లోనే సైనా విజయం సాధించింది.
ఈ ఏడాదే మూడుసార్లు సైనా.. యమగూచి చేతిలో మూడు సార్లు పరాజయం పాలైంది. ప్రస్తుత ర్యాంకుల్లో యమగూచి నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. అంతేకాదు సైనాపై 3-1తో మెరుగైన రికార్డుని కూడా కలిగి ఉంది. గతంలో 2014లో సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ సూపర్ సిరిస్ విజేతగా నిలిచింది. అనంతరం 2015లో ఇదే టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవల నాగ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.