హైదరాబాద్/ముంబై: రియో ఒలింపిక్స్ 2016లో గాయం కారణంగా వెనుదిరిగిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇప్పుడు సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సైనా.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఇచ్చిన విందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ట్విట్టర్‌లో దీపికాకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఇల్లు చాలా బాగుందంటూ పొగిడేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా సైనా ఫోకస్ సినిమాలపైకి మళ్లిందనే వాదన వినిపిస్తోంది.
అయితే, ఎప్పటి నుంచో రాకెట్ క్వీన్ బయోపిక్ రాబోతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పాత్రలో దీపికా అయితేనే బాగుంటుందని గతంలో సైనా అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పనిమీద దీపికాను కలిసి ఉండొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ నటి ఛార్మీతో విందులో కూడా సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. ఇద్దరు కలిసి విందు ఆరగిస్తున్న ఫొటోను సైనా నెహ్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా, తీవ్ర గాయం కారణంగా ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగిన సైనా నెహ్వాల్.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుంది. దాదాపు మూడు నెలలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిసింది. ఆ తర్వాతనే ఆమె మళ్లీ రాకెట్ పట్టుకుని బ్యాడ్మింటన్ కోర్టులో అడుపెట్టనుంది.