
దక్కన్ క్రానికల్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి సైనాకు ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ముట్టలేదని, దానికి సైనా మాత్రం ముందస్తుగా 70 లక్షల రూపాయలు పన్ను చెల్లించిందని ఓ ఆంగ్లదినపత్రిక రాసింది. రితీ స్పోర్ట్స్‌తో డీల్ కుదుర్చుకోవడానికి ముందు సైనా దక్కన్ క్రానికల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
డిసితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సైనా దాదాపు అరడజను ప్రొడక్టులను ఎండార్స్ చేసింది. మేనేజర్ల ద్వారా డబ్బులు ఆమె ఖాతాలో జమ కావాల్సి ఉంది. సొమ్ము మొత్తం తన చేతికి అందనప్పటికీ డిసి ఒప్పందం ద్వారా లభించే ఆదాయానికి ఆదాయం పన్ను అధికారులు సైనాకు నోటీసులు జారీ చేశారు.
మీడియా కథనాల ప్రకారం - సైనా సెప్టెంబర్ 30వ తేదీన పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. తన ఏజెంట్ ద్వారా సైనా మూడు సార్లు డిసిని సంప్రదించినట్లు సమాచారం. అయినా ఫలితం లేకుండా పోయింది. డిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయం తెలుసు కానీ తనకు చెల్లించాల్సిన మొత్తానికి హామీ అయినా ఇస్తుందని అనుకున్నానని సైనా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన నగదు బహుమతి నుంచే 70 లక్షల రూపాయలు ఆదాయం పన్ను శాఖకు ఆమె చెల్లించినట్లు తెలుస్తోంది.