
హైదరాబాద్: గౌహతి వేదికగా జరుగుతున్న సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-10, 21-10 తేడాతో నేహా పండిట్‌పై విజయం సాధించింది.
ఆరంభం నుంచీ ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సైనా ఆద్యంతం దూకుడుగా ఆడటం విశేషం. సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్ 22 ఏళ్ల వైష్ణవితో తలపడనుంది. వైష్ణవి గతేడాది ఉబెర్ కప్ జట్టుకు ఆడారు. ఇక పురుషుల సింగిల్స్‌లో సైనా భర్త పారుపల్లి కశ్యప్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.
పారుపల్లి కశ్యప్ 21-18, 21-16 తేడాతో బొద్దిహిత్ జోషిపై విజయం సాధించాడు. మరోవైపు సౌరభ్ వర్మ సైతం సెమీస్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 21-11, 21-23, 21-18తో సాయి ప్రణీత్‌పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.