పుజూ: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తొలి రౌండ్‌లో సత్తా చాటి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు ఇదే టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.
తొలి మ్యాచ్‌లో భాగంగా పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)తో తలపడిన సైనా 16-21, 21-19, 14-21తో పరాజయం పాలైంది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా మూడు నెలల తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ టోర్నీతో మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టింది.
అయితే తొలి సెట్‌ను చేజార్చుకున్న సైనా నెహ్వాల్ రెండో గేమ్‌లో పుంజుకుంది. దీంతో నిర్ణయాత్మకంగా మారిన మూడో గేమ్‌లో సైనా తడబడింది. గంట సేపు జరిగిన మ్యాచ్‌లో సైనా 16-21, 21-19, 14-21తో పరాజయం పాలైంది. తనకు ఎంతగానో కలిసొచ్చిన చైనా ఓపెన్‌తో రీఎంట్రీ ఇచ్చినా సైనాకు తీవ్ర నిరాశే ఎదురైంది.

ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో చోటు దక్కాలంటే చైనా, హాంకాంగ్ ఓపెన్ టోర్నీలలో సైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అయితే చైనా ఓపెన్‌లోనే సైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చియా సిన్ లీపై పీవీ సింధు విజయం సాధించింది.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు 21-12, 21-16తో కేవలం 34 నిమిషాల్లోనే విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక పురుషుల సింగిల్స్‌లో హాంకాంగ్ క్రీడాకారుడితో తలపడిన హెచ్‌ఎస్ ప్రణయ్ 21-13, 21-13తో విజయం సాధించగా, అజయ్ జయరాం బీజింగ్ క్రీడాకారుడిపై 21-19, 20-22, 21-17తేడాతో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు.