
ఓర్లీన్ (ఫ్రాన్స్): భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్.. ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన మేరీ బాటోమెన్‌ను 18-21, 21-15, 21-10తో ఓడించి సైనా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బీడబ్ల్యూఎఫ్ సవరించిన ఒలింపిక్ అర్హత వ్యవధిలో భాగమైన సూపర్ 100 ఈవెంట్‌లో 51 నిమిషాల పాటు కొనసాగిన గేమ్‌లో సైనా అద్భుత ప్రదర్శన చేసింది.
తోలి గేమ్ కోల్పోయినా మిగతా రెండు గేమ్‌లలో సత్తాచాటిన సైనా నెహ్వాల్.. 65 నంబర్ మేరీకి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా.. ర్యాంకింగ్స్ పాయింట్లు దక్కించుకొని రేసులోకి రావాలని భావిస్తున్నది. తొడ గాయం కారణంగా గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సైనా.. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన యాయెల్ హోయాక్స్ లేదా మలేషియాకు చెందిన ఐరిస్ వాంగ్‌తో తలపడనుంది.
162వ స్థానంలో ఉన్న ఇరా శర్మ కూడా ఒర్లీన్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నది. ఐరా.. బల్గేరియాకు చెందిన మరియా మిట్సోవాను 21-18, 21-13 స్కోరుతో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో మిట్సోవాను మట్టికరిపించింది. ఈ 21 ఏళ్ల ఇరా తదుపరి గేమ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫెర్సన్‌తో పోటీపడే అవకాశాలు ఉన్నాయి. బుధవారం మహిళల డబుల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలు అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కి రెడ్డి జంట డెన్మార్క్ జంట అమాలీ మాగెలుండ్, ఫ్రీజా రావ్న్‌ను 21-9, 17-21, 21-19తో విజయం సాధించారు.