హైదరాబాద్ : పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండే రంగాల్లో.. మరీ ముఖ్యంగా సినిమాలు, క్రీడల్లో రాణించేవాళ్లలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే అందుకు తగ్గట్టు వారు పడే కష్టం కూడా విస్మరించలేనిది. తమదైన రోజున పూర్తి స్థాయిలో సత్తా చాటగలిగే క్రీడాకారులకు దేశంలో అభిమానులంతా పట్టం కడుతారు. ఎనలేని పాపులారిటీ.. ఎక్కడికెళ్లినా ఫుల్ క్రేజ్..
50 కోట్ల డీల్ :
రియో ఒలింపిక్స్ లో దేశం తరుపున సత్తా చాటిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పుడిదే పాపులారిటీ ఆమె బ్రాండ్ వాల్యూను క్రికెటర్ల రేంజ్ కు తీసుకెళ్లిందంటే అతిశయోక్తి కాదేమో! ప్రముఖ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ అయిన బేస్ లైన్ కంపెనీతో తాజాగా రూ.50 కోట్ల పైనే సింధు ఒప్పందం కుదుర్చుకోవడం ఇందుకు నిదర్శనం.

9 సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా..
ప్రముఖ కంపెనీల ఉత్పత్తులకు భారీ పబ్లిసిటీ కావాలి.. ఆ ప్రచారం త్వరగా జనం దృష్టిని ఆకర్షించాలంటే.. పాపులారిటీ ఉన్న వ్యక్తులతో ఆయా ఉత్పత్తులు డీల్ కుదుర్చుకోవడం పరిపాటి. అందుకే.. పాపులర్ వ్యక్తులు ఎక్కడుంటారో ప్రముఖ బ్రాండింగ్ సంస్థలు వారి ముందు వాలిపోతాయి. ఇప్పుడు సింధు విషయంలోను ఇదే జరుగుతోంది. రాబోయే రోజుల్లో దాదాపుగా 9 సంస్థలకు సింధు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అనధికారికంగానే 50కోట్లు.. అధికారికంగా..!
తాజాగా బేస్ లైన్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో 50కోట్ల డీల్ అనేది పైకి వినిపిస్తున్న మాట మాత్రమే. అధికారికంగా ఎన్ని కోట్ల డీల్ కుదిరిందన్నది తెలియదు. డీల్ విషయాన్ని మాత్రం సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ తుహిమ్ మిశ్రా వెల్లడించారు. ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన తర్వాత సింధు పాపులారిటీ అమాంతం పెరగడంతో.. సింధుతో చాలా కంపెనీలు బ్రాండింగ్ కు ముందుకొస్తున్నట్టు ఆయన వివరించారు.
బ్రాండ్ వాల్యూ మరింత పెరిగేలా
వచ్చే మూడేళ్లలో సింధు బ్రాండ్ వాల్యూను మరింత పెంచడానికి ప్రయత్నిస్తామని బేస్ లైన్ డైరెక్టర్ తుహిమ్ చెబుతోన్న మాటలను బట్టి చూస్తోంటే.. రాబోయే రోజుల్లో ఆయా కంపెనీలు సింధుకు ఆఫర్ చేసే మొత్తం కూడా అమాంతం పెరగనుంది. ప్రస్తుతం సింధుతో ఒప్పందం కుదుర్చుకున్న బేస్ లైన్ కంపెనీ బ్రాండ్ ప్రొఫైలింగ్, లైసెన్సింగ్ తో పాటు వివిధ కంపెనీలతో సింధు ఒప్పందాలను పర్యవేక్షించనుంది. ఏదేమైనా దేశంలో క్రికెటర్లకు మాత్రమే పరిమితమైన కోట్ల రూపాయల డీల్స్ ను సింధు తన ఖాతాలోను వేసుకుంటుండడం విశేషం.