న్యూఢిల్లీ: భారత దేశంలో ఇటీవల ఎక్కువ మంది గూగుల్‌లో ఏ అంశం గురించి సెర్చ్ చేశారంటే.. పీవీ సింధు గురించే. రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు ఆడుతుంటే ఆమె గురించిన వివరాలు తెలుసుకునేందుకిు ఎక్కువగా ఆమె పేరును సెర్చ్ చేశారు.
ఆ తర్వాతి స్థానంలో రెజ్లింగులో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ను వెతికారు. ప్రపంచ నెంబర్ 6 ర్యాంకర్ నోజోమీ ఒకుహారాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్న పీవీ సింధును మన దేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేసారు. ఈ విషయాన్ని గూగుల్ సంస్థ తెలిపింది.
ఆ తర్వాత వరుసగా సాక్షి మాలిక్, కిదాంబి శ్రీకాంత్, దీపా కర్మాకర్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, వినేష్ పోగట్, లలితా బాబర్, వికాస్ యాదవ్, నర్సింగ్ యాదవ్‌లు నిలిచారు. భారతీయులు ఎక్కువగా బ్యాడ్మింటన్ గురించి, ఆ తర్వాత రెజ్లింగ్ గురించి సెర్చ్ చేశారు.

వీరి గురించే కాదు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసెన్ బోల్ట్ గురించి కూడా మన దేశంలో బాగానే వెతికారు. విదేశీ క్రిడాకారుల్లో బోల్ట్ తర్వాత శ్రీకాంత్‌ను ఓడించిన చైనా షట్లర్ లిన్ డాన్, సింధు చేతిలో ఓడిన ఒకుహారా, స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్, చైనా షట్లర్ వాంగ్ యిహాన్ తదితరుల గురించి వెతికారు.
సింధుకు బాయ్ రూ.50 లక్షల రివార్డు
ఒలింపిక్స్ లో రజితం గెలిచిన సింధుకు బాయ్ (బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) రివార్డు ప్రకటించింది. ఆమెకు రూ.,50 లక్షలు ప్రకటించింది. అలాగే సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు.