విజయవాడ/హైదరాబాద్: రియో ఒలింపిక్స్ 2016లో పతకమే గగనం అనుకున్న సమయంలో రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం గెలిచింది. ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు ఏకంగా ఫైనల్లోకి దూసుకెల్లి... స్వర్ణంకు ఒక అడుగు దూరంలో ఉంది. కరోన్ మరోలినాతో ఫైనల్ జరగనుంది.
మరోలినాతో గెలిస్తే పీవీ సింధు రికార్డ్ సృష్టించినట్లే. అబినవ్ బింద్రా మినహా మనకు ఒలింపిక్స్‌లో స్వర్ణం తెచ్చిన వారు లేరు. ఇప్పుడు సింధు గెలిస్తే స్వర్ణం ఖాయం. పీవీ సింధు స్వర్ణం గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చెప్పారు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
కాగా, ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తెలుగు వారిలో కరణం మల్లీశ్వరి తర్వాత పీవీ సింధూయే. మధ్యలో సైనా నెహ్వాల్ ఉన్నారు. ఆమె కూడా హైదరాబాదీయే. కానీ హర్యానాకు చెందిన అమ్మాయి. అచ్చ తెలుగు వారిలో మల్లీశ్వరి తర్వాత మాత్రం పీవీ సింధు.

కరణం మల్లీశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ. ఈమె 1975 జూన్ 1 జన్మించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగులో ఆమె కాంస్యం గెలుచుకుంది.
1993లో మెల్బోర్న్‌లో కాంస్యం, 1994 ఇస్తాంబుల్‌లో స్వర్ణం, 1995 గాంగ్జూలో స్వర్ణం, 1996 గాంగ్జూలో కాంస్యం గెలుచుకుంది. ఇవన్నీ వరల్డ్ ఛాంపియన్ షిప్స్. 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది.

ఇక, ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలవడమే ఇప్పటిదాకా భారత షట్లర్ అత్యుత్తమ ప్రదర్శన. కానీ సింధు మరో అడుగు ముందుకేసింది.
సింధు రియో ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఆమె కరోన్ మరోలినా పైన గెలిస్తే స్వర్ణం. ఓడితే సిల్వర్ గెలుచుకుంటుంది. పీవీ సింధు దూకుడు, ఆమె ఫిట్‌నెస్ చూస్తుంటే స్వర్ణం గెలిచేలా కనిపిస్తోందని అంటున్నారు. భారతీయులందరి కోరిక కూడా అదే. ఒలింపిక్స్ పతకం గెలిచిన ఐదో భారతీయ మహిళగా కూడా పీవీ సింధు నిలిచింది. ఫైనల్లో గెలిచి స్వర్ణం సాధిస్తే మరో రికార్డ్.