హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన పివి సింధు ఆంధ్ర అమ్మాయా, తెలంగాణ బిడ్డనా అనే చర్చ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా సాగుతోంది. ఇరు రాష్ట్రాల వారు కూడా ఆమెను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె తల్లి విజయలక్ష్మి మాత్రం - చాంపియన్ షట్లర్ ఎవరైనా, ఆమె ముందు భారతీయురాలంటూ సింధు తల్లి అన్నది.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది కాబట్టి ఆమె తెలంగాణ బిడ్డ అని కొందరు వాదిస్తున్నారు. దాన్ని అంధ్రవాళ్లు కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు ఏ కులస్తురాలన్న విషయాన్ని కూడా కొందరు ఆరా తీస్తున్నారు. కానీ సింధు పేరెంట్స్ మాత్రం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
ఒక వర్గం మాత్రం సింధును తెలుగుతేజంగా అభివర్ణిస్తున్నారు. ఏ ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి చెందినా ఆమె భారతీయురాలని సర్దిచెప్పేవారు చాలా మందే ఉన్నారు. సింధు తండ్రి పేరు పూసర్ల వెంకట రమణ. తల్లి పేరు విజయలక్ష్మి. ఏదేమైనా సింధు ముందుగా భారతీయురాలని ఆమె తల్లి విజయలక్ష్మి స్పష్టం చేశారు.

సింధు జన్మస్థలం సికింద్రాబాద్. మారేడ్‌పల్లిలో ఆమె నివాసం. సింధు తండ్రి రమణ ఓ స్పోర్ట్స్ ఆఫీసర్. దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బోనాల సంబరాల్లో సింధు పాల్గొంది. లాల్‌దర్వాజ్ అమ్మవారికి ఆమె బోనం సమర్పించింది. దాంతో సింధు తెలంగాణ బిడ్డ అన్న వాదం బలంగా మారింది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాల్లో కూడా సింధు పాల్గొంది.
సింధు తండ్రి రమణ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నిర్మల్‌లో జన్మించారు. భర్త తరహాలోనే సింధు తల్లి విజయలక్ష్మి కూడా వాలీబాల్ ప్లేయర్. విజయలక్ష్మి మాత్రం విజయవాడ వ్యాపారవేత్త కూతురు. సింధు ఆంధ్రా అయినా, తెలంగాణ అయినా, ఒలింపిక్ పతకం మాత్రం భారత్ ఖాతాలో చేరిందనేది వాస్తవం.
ప్రస్థానం మాత్రం ఇక్కడి నుంచే..
కాగా, సింధు బ్యాడ్మింటన్ ప్రస్థానం నెల్లూరులోనే ప్రారంభమైంది. 2010లో నెల్లూరులో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఇదే పోటీల్లో అండర్ - 15 విభాగంలో సింధు జైత్రయాత్ర కొనసాగించింది. ఓవరాల్ చాంపియన్ షిప్‌తోపాటు జాతీయ జట్టుకు సింధు ఎంపికైంది.