హైదరాబాద్/రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్‌లో జపాన్ క్రీడాకారిణి నోజోమీ పైన గెలుపొందిన తెలుగు తేజం పీవీ సింధుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మెడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్, టిటిడి జేఈవో శ్రీనివాస రాజు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
అంతా గోపీచంద్ వల్లే
రియోలో సింధూ ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు, సోదరి దివ్య ఆనందం వ్యక్తం చేశారు. సింధు గెలుపులో కోచ్ గోపీచంద్‌కు ఎక్కువ క్రెడిట్ వెళ్తుందన్నారు. గోపీచంద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని తల్లిదండ్రులు, సోదరి చెప్పారు. ఆయన ఎప్పుడు ప్రత్యేకంగా ఆటగాళ్ల పైన దృష్టి సారిస్తారని చెప్పారు. తాము బాగా ఆడమని చెప్పామని, ప్రత్యేకంగా ఏం చెప్పలేదన్నారు.

మిఠాయిలు పంచుకున్నారు
సింధు ఫైనల్లోకి ఆరంగేట్రం చేసిన నేపథ్యంలో సింధు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
సింధుకు అవే ప్లస్
సింధూ సర్వీస్ బలంగా ఉంటుందని, అవే ఆమెకు ప్లస్ పాయింట్స్ అని అన్నారు. అలాగే సింధూ పొడవుగా ఉంటుంది. జపాన్ క్రీడాకారిణి కాస్త పొట్టిగా ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆడిందని చెబుతున్నారు. మ్యాచ్ సమయంలో ఎక్కడా సింధు ఒత్తిడికి గురి కాలేదు. ఆత్మవిశ్వాసంతో ఆడింది. భారీ ర్యాలీలు ఆడి, ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది.
ఫైనల్ ఎప్పుడు, ఎవరితో?
జపాన్ క్రీడాకారిణితో సెమీ ఫైనల్లో గెలిచిన నేపథ్యంలో సింధు రేపు (శుక్రవారం) సాయంత్రం స్పెయిన్ క్రీడాకారిణి మరోలినాతో తలపడనుంది. రేపు సాయంత్రం ఏడున్నరకు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
సైనా, గోపీచంద్ వల్ల కానీ పని..
బ్యాడ్మింటన్ ఫైనల్లోకి ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేదు. ఇప్పుడు సింధూ చేసి చూపించింది. సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రకాశ్ పడుకొనేల వల్ల సాధ్యం కానిది సింధూ చేసి చూపింది.