రియో డీ జెనిరో: ఆసియా ప్రపంచాన్ని తాను బ్రేక్ చేశానని, తన స్వప్నం సాకారమైందని రియో ఒలింపిక్ బ్యాడ్మింటన్ మహిళా విభాగం స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ అన్నది. తెలుగు తేజం పివి సింధును ఫైనల్ మ్యాచులో ఓడించి ఆమె స్వర్ణపతకాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో విజయం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది.
ఒలింపిక్‌లో ఈ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి ఆసేయేతర మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. మ్యాచులో పాయింట్ సాధించిన ప్రతిసారీ మారిన్ గట్టిగా కేకలు వేస్తూ వచ్చింది. అంపైర్ పలు సార్లు ఆమెను హెచ్చరించారు కూడా. షటిల్ మార్పు విషయంలోనూ ఆమె అంపైర్‌తో వాదనకు దిగుతూ వచ్చింది.
షటిల్ కొత్తది తీసుకోవడం వ్యూహంలో భాగమని కూడా మారిన్ అంది. సింధు మాత్రం పాత షటిల్‌ను వాడుతూ వచ్చింది. ఇద్దరు కూడా మైండ్ గేమ్ కొనసాగిస్తూ వచ్చారు. షిటల్ మార్చకపోవడం ద్వారా సింధు తన ఫోకస్‌ను దెబ్బ తీయాలని చూసిందని మారిన్ అంది.

మారిన్ అరుపులు, కేకలను సింధు పట్టించుకోలేదు. ప్రతి దానికీ తాను సిద్ధపడ్డానని, అది జరుగుతుందని తనకు తెలుసునని, అది ప్రతిసారీ జరుగుతుందని, తాను పెద్దగా పట్టించుకోలేదని, అది ఆటలో భాగమని సింధు అన్నది. ఫైనల్ విజయం తర్వాత కరోలినా మారిన్ గ్రౌండ్‌పై బోర్లా పడి కంటతడి పెట్టింది. చాలా సేపు ఆమె లేవలేదు.
సింధు మారిన్ వద్దకు వెళ్లి తట్టి లేపి, శుభాకాంక్షలు చెప్పి, ఆలింగనం చేసుకుంది. దీన్ని వ్యాఖ్యత ఒకరు క్రీడాస్ఫూర్తిగా అభినందించారు.