హైదరాబాద్: తెలుగు తేజం, హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిమి పీవి. సింధు మరోసారి అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించింది. వరుసగా మూడోసారి మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో విజయం సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన మినత్సు మితానిపై విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. 66 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్‌లో తాను గెలిచిన రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చూపించిన సింధు 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని ఓడించింది.

మొదటి సెట్ సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్‌లో మితానిని గట్టి పోటీ ఇచ్చింది. ఆ వెంటనే మూడో గేమ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడి 21- 14తేడాతో గెల్చుకుని వరుసగా మూడో సారి మకావ్ ఓపెన్ విజేతగా నిలిచింది.
మకావ్ ఓపెన్ 2013, 2014లలో విజేతగా నిలిచిన సింధు వరుసగా 2015 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. గత ఏడాది ఇదే మకావు ఓపెన్‌లో చివరిసారి అంతర్జాతీయ టైటిల్ సాధించిన సింధుకు ఆ తర్వాత టోర్నీల్లో నిరాశ ఎదురైంది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రన్నరప్‌గా నిలిచింది.