హైదరాబాద్: రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచులో ఓడినా కూడా హైదరాబాదీ షట్లర్ పివి సింధు అందరి మనసులనూ గెలుచుకుంది. నెంబర్ వన్ కరోలినా మారిన్‌కు చెమటలు పట్టించింది. బ్యాడ్మింటన్ అంటే సైనా నెహ్వాల్ గుర్తుకు వచ్చేది. ఇప్పుడు సింధు చరిత్ర తిరగ రాసింది.
సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో కాంస్యం, ఎన్నో సూపర్ సిరీస్‌లు, మరెన్నో గ్రాండ్ ప్రీ టైటిళ్లు గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ కోసం సైనా పోరాడుతున్న కాలంలో సింధు రాకెట్‌లా దూసుకొచ్చింది. పోటీ పడిన తొలిసారే ఒలింపిక్ పతకాన్ని సాధించింది. దీంతో సింధు సైనా సరసన చేరింది.

గురువు గోపీచంద్ ఇచ్చే శిక్షణకు సింధు ధీటుగా నిలిచింది. బ్యాడ్మింటన్‌లో చైనా వాళ్లకు తిరుగులేదన్నది నిజం కాదని, వాళ్లని మనం ఓడించగలమని గోపిచంద్ చెప్పిన మాటలను సింధు నిజం చేసింది. అగ్రశ్రేణి చైనా షట్లర్లను ఒలింపిక్ మ్యాచుల్లో ఓడించింది.
ఒలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు నిరాశాజనకమైన ప్రదర్శన కనబరుస్తున్న క్రమంలో సాక్షి మాలిక్ కాంస్యం సాధించింది. ఆ తర్వాత సింధు భారతీయుల ఆశలను పెంచుతూ వచ్చింది. సెమీస్‌లో ఓకుహరపై సింధు ఆటను చూసినవారంతా ఆ తెగువకు ఫైనల్ కూడా గెలవడం ఖాయమనుకున్నారు. కానీ, ఎనలేని పోరాట పటిమను కనబరుస్తూ ఓటమి పాలైంది. అయినా ఆమెను మెచ్చుకోనివారు లేరు.
సింధు తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో రోజుకు వంద కిలోమీటర్లు ప్రయాణించేది. గోపీచంద్ అకాడమీలో చేరిన సింధు తెల్లవారు జామున 4.30కే నిద్ర లేచి ఐదున్నర కల్లా అకాడమీకి చేరుకునేది. ఏడున్నర వరకు సాధన చేసి 8.30కు పాఠశాలకు వెళ్లి మళ్లీ సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు శిక్షణ తీసుకునేది. ఇటు చదువు, అటు ఆటల కోసం రోజూ సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణించేది. ఇలా కొన్నేళ్ల పాటు సింధు శ్రమించింది. ఆటల్లో పతకాలు సాధిస్తూనే పది, ఇంటర్‌ల్లో ప్రథమశ్రేణిలో పాసయ్యింది.