రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. లండన్ రజత పతక విజేత, ప్రపంచ నెం.2 షట్లర్ వాంగ్ యిహన్(చైనా)కు షాకిచ్చింది. వాంగ్ యిహన్‌పై పై 22-20, 21-19 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది సింధు.

తొలి సెట్‌లో 18వ పాయింట్ వరకు వెనుకంజలో ఉన్న సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించింది. అనంతరం చైనా షట్లర్ కూడా పుంజుకోవడంతో 20-20తో స్కోరు సమమైంది. వెంటనే తెరుకున్న సింధు రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను దక్కించుకుంది.
రెండో సెట్‌లో మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన సింధు 18-13 వద్ద వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకోవడంతో చైనా షట్లర్ లీడ్‌లోకి వెళ్లింది. అక్కడ సింధు ఎదురుదాడికి దిగి మ్యాచ్‌ను 21-19తో ముగించింది. 18న జరిగే సెమీస్‌లో సింధు జపాన్‌కు చెందిన షట్లర్‌తో తలపడనుంది. కాగా, సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు పతకం ఖామమైనట్లే.
కాగా, సింధు విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి తనకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టమని, ఆమె విజయాలకు కోచ్ గోపీచంద్ కూడా కారణమని చెప్పారు. సింధు తప్పకుండా ఒలింపిక్స్ పతకం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బెస్ట్ మూమెంట్: సింధు
'రియోలో ఆడుతున్న ఫీలింగ్ కొత్తగా ఉంది. నా కెరీర్ లోనే ఇదో బెస్ట్ మూమెంట్. ఈ తరహా బెస్ట్ మూమెంట్స్ మరిన్ని వస్తాయని భావిస్తున్నా. ఆట గురించి మాత్రమే ఆలోచించా. ఉత్తమంగా రాణిస్తే గెలుపు దానంతటదే వస్తుంది. మెడల్ కూడా వస్తుంది. కేవలం మ్యాచ్ పైనే ఫోకస్ చేశా. ఇక తర్వాతి మ్యాచ్ పై దృష్టి పెడతా. అందులోనూ మెరుగ్గా రాణించగలనని భావిస్తున్నా' అని సింధు పేర్కొంది. కాగా, సెమీస్ చేరిన సింధుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

నర్సింగ్ భవితవ్యం మళ్లీ ప్రశ్నార్థకం
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ భవితవ్యం మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. డోపింగ్ కుట్ర కేసులో నర్సింగ్‌కు జాతీయ డోపింగ్ వ్యతిరేక సంఘం(నాడా) క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజన్సీ (వాడా) క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టులో అపీలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోందని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా వాడా అధికారుతో చర్చిస్తున్నారని భారత క్రీడాబృందం చీఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా పిటిఐకి చెప్పారు.
ఒక వేళ ఆర్బిట్రేషన్ కోర్టు గనుక వాడా అపీల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయితే నర్సింగ్ ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనలేడు సరికదా, నాలుగేళ్ల పాటు అతను నిషేధాన్ని సైతం ఎదుర్కోవలసి వస్తుంది. నర్సింగ్ 74 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో ఆగస్టు 19న పోటీ పడాల్సి ఉంది.
ఈయేడాది జూన్ 25న నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నర్సింగ్ విఫలమయ్యాడు. అతని శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం మిథేన్ డైడోన్ అధిక మోతాదులో ఉన్నట్లు తేలింది. అయితే తనను అన్యాయంగా కుట్రలో ఇరికించారని నర్సింగ్ వాదించడంతో విచారించిన నాడా అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య కూడా అనుమతించింది. ఆ తర్వాత నాడా క్లీన్‌చిట్ ఫైల్‌ను వాడాకు పంపించింది.
కేసు ఫైలును పరిశీలించి సంతృప్తి చెందని పక్షంలో వాడా అప్పీలు చేస్తుంది. మరో రెండు రోజుల్లో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తరుణంగా ఇలా జరగడం నిజంగా భారత శిబిరంలో నిరాశా నీడలు కమ్ముకునేలా చేశాయి. ఇప్పటికే పాల్గొన్న క్రీడాకారులంతా వరసగా విఫలమవుతూ వస్తున్న తరుణంలో భారత్ పతకం ఆశలన్నీ బ్యాడ్మింటన్, రెజ్లింగ్‌పైనే ఉన్నాయి.