హైదరాబాద్: రియో ఒలింపిక్స్ ఫైనల్లోకి అడుగుపెట్టడంతో పివి సింధుకు తెలుగు ప్రజలే కాదు భారత ప్రజలు జైకొడుతున్నారు. భారత్‌కు రెండో పతకాన్ని ఆమె ఖాయం చేసింది. ఈ సమయంలో పివి సింధుపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదే సమయంలో ఓ ముఖ్యమైన ఆమె ఫొటో కూడా ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తోంది.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
సికింద్రాబాద్ లాల్ దర్వాజా బోనాల ఉత్సవంలో ఆమె బోనమెత్తిన ఫొటో వైరల్ అవుతోంది. అదే సమయంలో ఓ చెత్త చర్చ కూడా సాగుతోంది. సింధు తెలంగాణ అమ్మాయా, ఆంధ్ర అమ్మాయా అనేది ఆ చర్చ. "మొన్న గెల్చినప్పుడు సుత మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆశీస్సులు తీసుకోవడానికి పోయింది "సింధు" తప్ప వేరే ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదు.పాయింట్ టు బి నోటేడ్" ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు.
అదే సమయంలో సింధు గతంలో ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యను కూడా గుర్తు చేస్తున్నారు. "మా పాప సింధు ఈ అద్భుతమైన విజయం సాధించడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అద్భుతమైన సహకారం - సింధు తండ్రి గారు" అంటూ ఓ కామెంట్ ఫేస్‌బుక్‌లో సందడి చేస్తోంది. లాల్ దర్వాజా బోనాల ఉత్సవం సందర్భంగా పివి సింధు బోనాలు ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్న ఓ టీవీ చానెల్‌కు చెందిన వీడియో కూడా ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది.

అదే సమయంలో "పుల్లెల గోపీచంద్ పూర్వికులు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లావాళ్ళు కానీ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రము లోని నిజామాబాదు జిల్లాలో నిజామాబాదు టౌన్ కు పది కిలోమీటర్ల దూరం లో ఉన్న ధర్మారం లో సెటిల్ అయ్యిండ్రు" అని నెటిజన్లు చెబుతున్నారు.
సింధు ఆంధ్రకు చెందుతుందా, తెలంగాణకు చెందిందా అనే చర్చ అంత అవసరమైందేమీ కాదేమో. సింధును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రోత్సహించిన మాట వాస్తవమే. తెలంగాణకు గానీ, ఆంధ్రకు గానీ హైదరాబాద్ కేంద్రం కాబట్టి చాలా ప్రతిభావంతులు ఇక్కడి నుంచే బయలుదేరడం సహజం. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ గానీ, సైనా నెహ్వాల్ గానీ హైదరాబాదుకు చెందినవారు కారు. కానీ హైదరాబాదులోనే వారి ప్రతిభ వెలుగు చూసింది. తెలంగాణ వారిని సొంతం చేసుకుంది. అలాగే సింధును కూడా తెలంగాణ సొంతం చేసుకుంది. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌ను కించపరచాల్సిన అవసరం లేదు.
సింధు తల్లిదండ్రులు గుంటూరు జిల్లా మాచర్లకు సంబంధించినవారు. వారు సింధు అసలు పూసర్ల వెంకట సింధు. ఆమె హైదరాబాదులో పుట్టిపెరిగింది. సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్‌లో చదివింది. తల్లిదండ్రులు విజయలక్ష్మి, రమణ పేరెన్నిక గన్న వాలీబాల్ ప్లేయర్లు. దేశానికి మాచర్ల నుంచి పలు పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు కూడా. తండ్రి రమణ పివి రామన్న అవార్డు గ్రహీత కూడా.