
ఆరంభం నుంచే సింధు దూకుడు
స్పెయిన్‌లోని వెల్వా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లో భాగంగా సింధు మంగళవారం స్లోవేకియాకి చెందిన మార్టినా రెపిస్కాతో తలపడింది. సింధు ఆరంభం నుంచే దూకుడుగా ఆడడంతో రెపిస్కా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ అయినా సింధు.. రెపిస్కాను వరుస రౌండ్లలో 21-7, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో సునాయసంగా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

10 నిముషాల్లోనే తొలి సెట్ విన్
ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధు.. తొలి రౌండ్ ఆరంభంలోనే 4-1తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం రెపిస్కా వరుసగా రెండు పాయింట్లు సాధించి రేసులోకి వచ్చింది. అనంతరం ఒక్కసారిగా గేర్ మార్చిన సింధు దూకుడుగా ఆడుతూ వరుసగా పాయింట్లు సాధిస్తూ 7-4తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరును కొనసాగించి 11-4 అధిక్యంతో టై బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం కూడా చెలరేగిన సింధు 15-4, 17-5తో అధిక్యం కనబరుస్తూ చివరకు 21-7తో సునాయసంగా తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. కేవలం 10 నిముషాల్లోనే సింధు తొలి సెట్‌ను కైవసం చేసుకోవడం విశేషం.

రెండో సెట్‌లోనూ సింధు జోరు
అనంతరం మొదలైన కీలకమైన రెండో సెట్‌లోనూ ఏ మాత్రం తగ్గని సింధు.. అదే జోరు కనబరుస్తూ సెట్ ప్రారంభమైన 2 నిముషాల్లోనే 6-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. టైబ్రేక్ సమయానికి ప్రత్యర్థి రెపిస్కా ఒకే పాయింట్ సాధించిందంటే సింధు సత్తా అర్థం చేసుకోవచ్చు. అనంతరం 15-5, 18-8తో అధిక్యంలో నిలుస్తూ చివరకు రెండో సెట్‌ను 21-9తో గెలుచుకుంది. రెండో సెట్‌ను సింధు 14 నిముషాల్లోనే ముగించింది. దీంతో సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

సింధుపై భారీ అంచనాలు
కాగా సింధు 2019లో వరల్డ్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. అంతకుముందు ఒకసారి రనరఫ్‌గా కూడా నిలిచింది. ఈ సారి స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో సింధు టైటిల్ గెలుస్తుందని భారీ అంచనాలున్నాయి. కాగా గత ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












