హైదరాబాద్: అంచనాలు లేకుండా డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరిస్ ప్రీమియం టోర్నమెంట్ బరిలోకి దిగిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అద్భుతమైన ఆటతీరుని కనబరుస్తోంది. తనకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న క్రీడాకారిణులను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి 'సూపర్ సిరీస్' టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-15, 18-21, 21-17తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు తన సత్తా చాటింది.

నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 14-16తో వెనుకబడిన సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించింది. మారిన్‌పై సింధుకిది రెండో విజయం. చివరిసారిగా 2011లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో మారిన్‌ను ఓడించిన సింధు నాలుగేళ్ల తర్వాత ఆమెపై మళ్లీ విజయం సాధించింది.
ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ ఫైనల్లో, గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ చేతిలో సింధు ఓటమి పాలైంది. అంతక ముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-18, 21-19తో ప్రపంచ మాజీ చాంపియన్, ఏడో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది.
ఈరోజు (ఆదివారం) జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సింధు పోటీ పడనుంది.