న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన పీవీ సింధు ఇప్పుడు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో విజేతగా నిలిచింది.
టాప్ సీడ్ స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రెండు వరుస గేమ్‌ల్లో 21-19, 21-16తో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో జరిగిన పరాభవానికి కరోలినాపై సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది.

హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో ఓ సమయంలో ఇరువురి మధ్య 16-16, 18-18, 19-19 పాయింట్లతో నువ్వా నేనా అన్నట్లు కనిపించింది. ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో సింధు ఆ గేమ్‌ను 21-19తో సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో సింధు మొదటి నుంచి నుంచి మారిన్‌పై పైచేయి సాధిస్తూ వచ్చింది. అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ 21-16 పాయింట్లతో రెండో గేమ్‌తోపాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో సింధు కెరీర్‌లో రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకుంది.