
హైదరాబాద్: రాష్ట్రమంతటా ఆషాఢ మాసం బోనాల జాతర అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీ లాల్‌దర్వాజా శ్రీసింహవాహినీ మహంకాళీ అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బోనం సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా సిందు మాట్లాడుతూ అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు.

అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల ఉంటే తానింకా బాగా ఆడతానని సింధు ఈ సందర్భంగా తెలిపారు. అమ్మవారిని దర్శించుకునే సమయంలో సింధు వెంట ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయశాంతి కూడా అమ్మవారికి బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అమ్మవారిని తాను కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అంతకముందు ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.