
హైదరాబాద్: బీజింగ్ వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ దూసుకుపోతున్నారు. గురువారం జరిగిన పోటీల్లో వీరిద్దరూ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్టోతో జరిగిన పోరులో 10-21, 21-9, 21-9తో కిదాంబి విజయం సాధించాడు.
తొలి గేమ్‌ను 10-21తో కోల్పోయిన కిదాంబి శ్రీకాంత్... వరుసగా రెండు, మూడు గేమ్‌లను 21-9, 21-9తో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
ఇక, మహిళల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన పీవీ సింధు 21-12; 21-15తేడాతో బుసానన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి సాధించింది. సింధు 21-12, 21-15తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించిన సింధు.. తొలి గేమ్‌ను 21-12తో కైవసం చేసుకుంది.
ఇక, రెండో గేమ్‌లో కూడా అదే జోరు కొనసాగించి 21-15తో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 21-13, 21-19తో ఇజెనియా (రష్యా)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్‌రెడ్డి- మను అత్రి 16-21, 25-27తో కిమ్- ఆండర్స్ (డెన్మార్క్) చేతిలో, మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప 19-21, 21-15, 17-21తో తనక- యొనెమొటొ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు.