పెనాంగ్: మాజీ విజేత, ఇండియన్ షెట్లర్ పివి సింధు మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ ఫైనల్లోకి ప్రవేశించింది. దక్షిణ కొరియాకు చెందిన టాప్ సీడ్ సంగ్ జి హుయాంగ్‌ను ఓడించి లక్షా20వేల డాలర్ల టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. హుయాంగ్‌ను 21-19, 12-21, 21-10 తేడాతో చిత్తు చేసి అగ్రస్థానానికి చేరుకుంది.
ఇది ఇలా ఉండగా, మన దేశానికి చెందిన కిదంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ నుంచి నిష్క్రమించాడు. మలేషియాకు చెందిన ఇస్కందర్ జుల్కర్నేన్ జయీనుద్దీన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

క్లిష్టంగా సాగిన మొదటి గేమ్‌లో 25-27 తేడాతో రెండో సీడ్ శ్రీకాంత్ ఓటమి చెందగా, రెండో గేమ్‌ను 48 నిమిషాల్లోనే 9-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. ప్రపంచ నెం. 51 ర్యాంకరైన మలేషియన్ ఆటగాడు.. ప్రపంచ నెంబర్ 9 ర్యాంకరైన శ్రీకాంత్‌ను తేలికగా ఓడించాడు.
కాగా, శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-10, 21-10తో లిందావెని ఫనెత్రి(ఇండోనేషియా)పై అలవోకగా గెలిచింది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచులో హైదరాబాద్ అమ్మాయి సింధు ఆద్యాంతం ఆధిపత్యం చెలాయించింది.