హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాంఢ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో దినార్ దియా అయుస్తిన్ (ఇండోనేసియా)పై 21-12, 21-4 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు అరగంటలోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. తొలి గేమ్ అర్ధభాగంలో 11-5తో ముందంజ వేసిన పీవీ సింధు ప్రత్యర్థిపై విరుచుకపడింది. 16 నిమిషాల్లోనే 21-12తో ఈ గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో సింధుకు ఎదురులేకుండా పోయింది.

సెమీస్ చేరాలంటే పీవీ సింధు ప్రపంచ నెంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ని ఓడించాల్సి ఉంది. వీరిద్దరి మధ్య గతంతో ఎనిమిది మ్యాచ్‌లు జరగగా సింధు మూడుసార్లు మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-10 ఫాబియెన్ డెప్రెజ్ (జర్మనీ)పై విజయం సాధించింది. తొలి గేమ్ నెగ్గేందుకు చెమటోడ్చింది.
తొలుత 5-4తో స్వల్ప ఆధ్యిక్యంలో నిలిచిన సైనా ఆ తర్వాత ప్రత్యర్ధిపై విరుచుకుపడి క్వార్టర్స్ బెర్తుని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ విజయం సాధిస్తే, సెమీ ఫైనల్స్‌లో పరపర్పరం తలపడాల్సి ఉంటుంది.పురుషుల ప్రీక్వార్టర్స్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 13-21, 5-21తో ఆరో సీడ్ టియాన్ హోవెయ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
బుధవారం అర్ధరాత్రి జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలిరౌండ్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జోడీ 19-21, 20-22తో సియోంగ్-కిమ్ హనా (దక్షిణకొరియా) చేతిలో పోరాడి ఓడింది. కాగా శ్రీకాంత, అజ య్ జయరామ్‌తో పాటు డబుల్స్ జోడీలు తొలిరౌండ్‌లోనే ఓడిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ టోర్నీలో సింధు, సైనా మాత్రమే మిగిలారు.